మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు తీర్పును సమర్థిస్తున్నాం

మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు తీర్పును సమర్థిస్తున్నాం

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్​ను కొట్టేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. ఇది నోట్లపై ఓట్ల శక్తిని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. ఈ మేరకు కాంగ్రెస్‌‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌‌ ట్వీట్‌‌ చేశారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకం, పార్లమెంట్ ఆమోదించిన రెండు చట్టాలు, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీం కోర్టు పేర్కొందన్నారు. వీవీ ప్యాట్ల అంశంపై రాజకీయ పార్టీలను కలిసేందుకు ఈసీ తిరస్కరిస్తున్న అంశంపై కూడా సుప్రీం కోర్టు దృష్టి సారిస్తుందని భావిస్తున్నట్లు జైరాం రమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటింగ్‌‌ ప్రక్రియ పారదర్శకంగా ఉంటే ఈసీ ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నదని ఆయన ప్రశ్నించారు. 

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. సుప్రీం కోర్టు నిర్ణయం ఎన్నికల నిర్వహణలో పారదర్శకత తీసుకొస్తుందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం గట్టి బుద్ధి చెప్పిందని విమర్శించారు. ఈ స్కీమ్ ప్రారంభించినప్పుడే తాము అడ్డుకున్నామన్నారు. అపారదర్శక, అప్రజాస్వామిక స్కీమ్ అని విమర్శించామని తెలిపారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న నల్లధన మార్పిడి స్కీమ్​కు ఫుల్ స్టాప్ పడిందన్నారు. రాహుల్ గాంధీ ట్విట్టర్​లో స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయని మండిపడ్డారు. కపిల్ సిబల్ స్పందిస్తూ..‘సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో పార్టీలకు ఎలక్టోరల్​ బాండ్లు ఎవరు ఇస్తున్నారనే విషయం తెలుసుకోవచ్చు. క్విడ్ ప్రోకో లేకుండా ఎవరూ రాజకీయ పార్టీలకు పది లక్షలకు లేదా 15 లక్షలకు ఎలక్టోరల్ బాండ్​లు ఇవ్వరు. మొత్తం కోట్లలో ఉంటుంది. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం’ అని తెలిపారు.