కాంగ్రెస్​ బలహీన పడుతోంది..

కాంగ్రెస్​ బలహీన పడుతోంది..

మునుగోడు, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్​ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తెలిపారు. శనివారం మునుగోడులో మంత్రి జగదీశ్​రెడ్డి అధ్యక్షతన  జరిగిన సీఎం కేసీఆర్​‘మునుగోడు ప్రజా దీవెన’ సభలో పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ బలహీనపడుతోందన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని ఓడించే శక్తి రాష్ట్రంలో టీఆర్ఎస్​కు మాత్రమే ఉందన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్​ రెడ్డి నియోజకవర్గంలో సమస్యలు గాలికి వదిలేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్​ను బలపర్చామని, హుజూర్​నగర్, నాగార్జునసాగర్​ ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీకి సపోర్ట్​ చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఎన్నికలు వేరు, ప్రజా ఉద్యమాలు వేరని, ఆ కోణంలోనే టీఆర్ఎస్​కు మద్దతు తెలిపేందుకు పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు.  

‘భగీరథ’తో మునుగోడు నుంచి ఫ్లోరైడ్​ దూరం

అనంతరం మంత్రి జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ తో బాధపడేవారని మిషన్​భగీరథతో ఈ సమస్య తీరిపోయిందని మంత్రి జగదీశ్​రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ప్రాంతంలో గతంలో ఏ గ్రామంలో చూసిన కాళ్లు, నడుములు వంకరతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, ఉద్యమ సమయంలో కేసీఆర్ స్వయంగా ఈ ప్రాంతాన్ని పర్యటించి వారి బాధలను చూశారన్నారు. వారి గోస తీర్చేందుకే మిషన్ భగీరథ స్కీం ద్వారా ఇంటింటికి మంచి నీరు ఇచ్చి ఈ ప్రాంతం నుంచి ఫ్లోరైడ్ తరిమికొట్టామని అన్నారు. మునుగోడు నియోజకవర్గం వెనుకబాటుకు గత పాలకులే కారణమని వారికి బుద్ధి చెప్పాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా నిలుస్తారని మంత్రి తెలిపారు.