కాంగ్రెస్ పనిచేస్తున్నది కేసీఆర్‌‌‌‌ కోసమే : తరుణ్‌‌ చుగ్‌‌

కాంగ్రెస్ పనిచేస్తున్నది కేసీఆర్‌‌‌‌ కోసమే : తరుణ్‌‌ చుగ్‌‌

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్‌‌కు కాంగ్రెస్‌‌ బీ టీమ్‌‌ అని, ఆ పార్టీ కేసీఆర్ కోసం పనిచేసే దళమని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌‌చార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సీఎం కేసీఆర్ చేతులు కలిపారని, కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చే స్పీచ్‌‌లు కూడా ‘‘మిల్ కే లడ్ నా’’(కలిసి పోరాడుదాం) అన్నట్లుగా ఉన్నాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ పోయి, బీజేపీ సర్కార్ కొలువుదీరబోతోందని చెప్పారు. గతంలో రెండుసార్లు కాంగ్రెస్ నేతల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. కేసీఆర్‌‌‌‌తో చేతులు కలిపారని గుర్తుచేశారు. అందుకే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉందన్నారు. బీజేపీతోనే తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, పేదల జీవితాల్లో మార్పు తెస్తుందన్నారు. 

గురువారం ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూలోని చుగ్ నివాసంలో నిజామాబాద్‌‌కు చెందిన వ్యాపారవేత్త పైడి రాకేశ్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాశేక్ రెడ్డికి పార్టీ కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అర్వింద్, రాకేశ్ రెడ్డి భార్య రేవతి రెడ్డి, కుమార్తె సుచరితా రెడ్డి, అర్మూర్ బీజేపీ మహిళా నేత అట్లూరి విజయ భారతి హాజరయ్యారు. తరుణ్‌‌ చుగ్ మాట్లాడుతూ.. రాకేశ్ రెడ్డి చేరికతో నిజామాబాద్‌‌లో పార్టీ బలం మరింత పెరుగుతుందన్నారు. సామాజిక సేవాపరుడు, బిజినెస్ మ్యాన్‌‌గా రాకేశ్ రెడ్డి వేల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని చెప్పారు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరడం శుభపరిణామమన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేక తీవ్ర స్థాయికి చేరిందని, ఇదే టైమ్‌‌లో బీజేపీపై రోజురోజుకు విశ్వాసం పెరుగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం, అవినీతి లేని పాలన కేవలం ప్రధాని మోడీతోనే సాధ్యమని పేర్కొన్నారు.

ఎన్నికల ముందు కొట్లాడ్తరు.. తర్వాత దోస్తీ చేస్తరు: అర్వింద్‌‌

బీఆర్ఎస్ బీమారి అయితే.. దానికి బీజేపీయే వ్యాక్సిన్ అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వంటి వ్యాక్సిన్లు రిజక్ట్ అయ్యాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు కొట్లాడినట్లు నటించి.. ఆ తర్వాత దోస్తీ చేస్తారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌‌లో గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌‌లో చేరారన్నారు. మళ్లీ గెలిచే వాళ్లు ప్యాకేజీలు మాట్లాడుకొని పోతారని ఆరోపించారు. కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని, భయపడి మెదక్‌‌కు పోవద్దన్నారు. తన నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సీట్లలో బీజేపీకి హై డిమాండ్ ఉందని, అన్ని సీట్లను తామే గెలుచుకుంటామని చెప్పారు. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి బిజినెస్ మ్యాన్‌‌గా పేరున్న రాకేశ్ రెడ్డి బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. 2 వేల మంది ఇండియన్లు ఆయన కంపెనీల్లో పని చేస్తున్నారని, వేల మంది రైతులు రాకేశ్ రెడ్డి ఇండస్ట్రీతో లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. తన ఫౌండేషన్ ద్వారా పేదలకు వైద్య, విద్య సదుపాయాలను అందిస్తున్నారని తెలిపారు. 

ఆర్మూర్‌‌‌‌లో రౌడీ రాజ్యాన్ని  తరిమికొడతా: రాకేశ్ రెడ్డి

ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరులు కోరుకున్న తెలంగాణ వేరని, బీఆర్ఎస్ పాలిస్తున్న తెలంగాణ వేరని రాకేశ్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌‌లోని ఆర్మూర్‌‌‌‌లో అభివృద్ధి లేదని, అక్రమ కేసులు, కబ్జాలు, రౌడీ రాజ్యం నడుస్తున్నదని, వీటికి వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు. త్వరలో టిప్పర్లను ఆపేస్తామని హెచ్చరించారు. స్థానిక ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై ఇండియాకు మోడీ తెచ్చిన గౌరవాన్ని చూసి బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఒక కార్యకర్తగా పార్టీలో చేరానని, ఏ బాధ్యత ఇచ్చిన పని చేస్తానని తెలిపారు.