ప్రభంజనంలా జనహిత పాదయాత్ర వేలాదిగా తరలివచ్చిన జనం.. ఉప్పరమల్యాల నుంచి మొదలైన పాదయాత్ర

ప్రభంజనంలా జనహిత పాదయాత్ర వేలాదిగా తరలివచ్చిన జనం..  ఉప్పరమల్యాల నుంచి మొదలైన పాదయాత్ర

గంగాధర, వెలుగు: కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో విడత జనహిత పాదయాత్ర కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. చొప్పదండి నియోజకవర్గంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చిన జనం అడుగడుగునా నీరాజనాలు పలికారు.

 ముందుగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయరమణారావు, మాజీ మంత్రి  జీవన్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఉప్పర మల్యాలలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. 

అనంతరం పార్టీ జెండా ఎగురవేసి పాదయాత్రను ప్రారంభించారు. ఉప్పరమల్యాల నుంచి కురిక్యాల మీదుగా మధురానగర్​కు 5కి.మీ మేరపాదయాత్ర సాగింది. కురిక్యాలలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు తీగల భాగ్య– గంగయ్య ఇంటిని రిబ్బన్ కట్ చేసి టీ, స్వీట్స్ తీసుకున్నారు. తమకు పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంపై భావోద్వేగానికి గురయ్యారు. 

దారిపొడవునా సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రజల సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం మధురానగర్ కు చేరుకుని కార్నర్ మీటింగ్ చేపట్టారు. కార్నర్ మీటింగ్ అనంతరం పార్టీ కార్యకర్త మ్యాక వినోద్ ఇంట్లో మీనాక్షి నటరాజన్ రాత్రి బస చేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ సంస్థ చైర్మన్​ సత్తు మల్లేశం, పార్లమెంట్ ఇన్​చార్జి వెలిచాల రాజేందర్ రావు, నేతలు వొడితల ప్రణవ్, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, సంతోష్ పాల్గొన్నారు. 

డ్యాన్స్ చేసి ఉత్సాహం నింపిన వీహెచ్

మధురానగర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాజీ ఎంపీ వి.హనుమంతరావు డ్యాన్స్ చేసి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తన కింద పనిచేసిన కేసీఆర్, చంద్రబాబు పార్టీలు మారి సీఎంలయ్యారని, తాను మాత్రం పదవి ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నానన్నారు.