
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం (ఈసీ)తో కలిసి బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈమేరకు ఒక వెబ్ పోర్టల్‌ను లాంచ్ చేసింది. యూజర్లు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని ఎన్నికల సంఘం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయవచ్చని కాంగ్రెస్ నేతలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ ఓటరు జాబితా కోసం గళమెత్తుతున్న రాహుల్‌కు మద్దతు తెలపవచ్చని చెప్పారు.
‘ఓట్ చోరీ.ఇన్/ఈసీడిమాండ్’లో రిజిస్టర్ చేసుకొని తనకు మద్దతు తెలపాలని కోరుతూ రాహుల్‌గాంధీ ‘ఎక్స్’లో ఓ వీడియో విడుదల చేశారు. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ అనే ప్రజాస్వామ్య సూత్రంపై ఓట్ల చోరీ ఒక దాడి ఆని ఆరోపించారు. పారదర్శక, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే డిజిటల్ ఓటరు జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లాగిన్‌తో సర్టిఫికెట్
‘ఓట్ చోరీ’లో యూజర్ లాగిన్ అయ్యాక ఆ వ్యక్తి పేరిట ఒక సర్టిఫికెట్ జారీ అవుతుంది. ‘‘డిజిటల్ ఓటర్ల జాబితా కోసం రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్‌కు నేను సపోర్ట్ చేస్తున్నా” అని ఆ సర్టిఫికెట్లో మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కోశాధికారి అజయ్ మాకెన్‌ల సంతకం ఆ సర్టిఫికెట్లో ఉంటుంది.