మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను

మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనన్న కాంగ్రెస్‌‌‌‌ నేత చిన్నారెడ్డి

హైదరాబాద్​, వెలుగు: డబ్బులుంటేనే రాజకీయం చేయాలని సీఎం కేసీఆర్ నిరూపించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. శనివారం సరూర్​నగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆయన మాట్లాడారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు లేకుండా ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి లేదని చెప్పారు. గ్రాడ్యుయేట్ కాని వాళ్లకు ఓటు హక్కు కల్పించారని.. తప్పుడు సర్టిఫికెట్లతో ఓట్లు నమోదు చేశారని విమర్శించారు. చదువుకోని వారి ఓట్లను నమోదు చేయడం వల్లనే చెల్లని ఓట్లు ఎక్కువగా వచ్చాయన్నారు. డబ్బులు పంచడం వల్లనే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందన్నారు. గతంలో డబ్బుల పంపిణీ ఆంధ్రాలోనే ఉండేదని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్​ఇక్కడా డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుస్తున్నారన్నారు. డబ్బు లేకపోతే ఎవరు కూడా ఎన్నికల్లో పోటీచేయవద్దన్నారు. తాగుబోతు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. తన పలుకుబడి 32 వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నానని చెప్పారు. నాగార్జునసాగర్‌‌‌‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌‌‌‌ను జానారెడ్డి మాత్రమే తట్టుకోగలరని చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికిమించి తనకు సహకరించారని తెలిపారు.