టీఆర్ఎస్ పెద్దల పాత్రపై కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదు

టీఆర్ఎస్ పెద్దల పాత్రపై కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదు

క్యాసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  చికోటి ప్రవీణ్తో టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కయ్యారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాలను బయటపెడతామని అన్నారు. ప్రవీణ్తో మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ కు సైతం సంబంధాలున్నాయని శ్రవణ్ ఆరోపించారు. కొండపాక గ్రామంలోని బ్యాంక్ లాకర్ తో పాటు ఓ టీఆర్ఎస్ నాయకుని ఇంట్లో చీకోటికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ పత్రాల సూట్ కేసులు ఉన్నాయని అన్నారు. ఆ డాక్యుమెంట్లను బయటకు తెప్పించి పక్షపాతం లేకుండా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈడీ అధికారులు బ్యాంక్ లాకర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సమగ్ర విచారణ జరపాలని కోరారు. 

విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు కష్టాలు పడుతుంటే చీకోటి మాత్రం జనం సొమ్ముతో క్యాసినో ఆడుతున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. చీకోటి వ్యవహారంలో టీఆర్ఎస్ పెద్దల పాత్ర ఉన్నా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డితో పాటు ఇతర టీఆఎస్ ఎమ్మెల్యేల సంబంధాలపై కేసీఆర్ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. చేయని తప్పుకు సోనియాను విచారిస్తున్న ఈడీ.. ఇంత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరగుతున్నా టీఆర్ఎస్ ఎమ్మేల్యేలు, మంత్రులను ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. చిట్టి దేవందర్ రెడ్డిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని దాసోజు డిమాండ్ చేశారు.