ప్రగతి భవన్‌‌ను రాజకీయాలకు వాడుతున్నరు: జి.నిరంజన్

ప్రగతి భవన్‌‌ను రాజకీయాలకు వాడుతున్నరు: జి.నిరంజన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌‌ను బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ రాజకీయాల కోసం వాడుతున్నదని కాంగ్రెస్‌‌ పార్టీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ విభాగం చైర్మన్ జి.నిరంజన్ ఆరోపించారు. కామారెడ్డిలో కేసీఆర్‌‌‌‌కు వ్యతిరేకంగా వంద నామినేషన్లు వేస్తామన్న అక్కడి రైతులను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌‌కు పిలిపించి, నామినేషన్లు వేయకుండా ఒప్పించారన్నారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌‌‌‌కు ఆయన లేఖ రాశారు. ‘‘కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌‌కు వ్యతిరేకంగా నిరసనలు చేసిన రైతులు.. అక్కడ కేసీఆర్‌‌‌‌ను ఓడించేందుకు వంద నామినేషన్లు వేస్తామని చెప్పారు. దీంతో రైతు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను కేటీఆర్ ప్రగతి భవన్‌‌కు​పిలిపించుకొని, మాస్టర్ ప్లాన్‌‌ను రద్దు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్‌‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను కూడా ఎత్తి వేస్తామని చెప్పారు.

అక్కడే డీజీపీ, కామారెడ్డి ఎస్పీ, మున్సిపాలిటీ అధికారులకు ఫోన్‌ చేసి, కేసులు ఎత్తేయాలని ఆదేశించారు. కొత్త మాస్టర్ ప్లాన్‌‌ను రద్దు చేసి పాత ప్లాన్‌‌నే అమలు చేయాలని సూచించారు”అని నిరంజన్‌‌ పేర్కొన్నారు. ఇన్నాళ్లూ వారిని పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు కేసీఆర్‌‌‌‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తామనే సరికి ప్రగతి భవన్‌‌కు పిలిపించుకుందన్నారు. ప్రగతి భవన్‌‌లో అధికార దుర్వినియోగంపై ఈ నెల 16, 20, 26 తేదీల్లో ఈసీకి తాము ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు.