
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ అనేది ఒక "అయోగ్య సంస్థ" అని కాంగ్రెస్ ఆరోపించింది. నీతి ఆయోగ్ సమావేశం అంటే కేవలం వంచన, దృష్టి మరల్చే కార్యక్రమమేనని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగును ఉద్దేశించి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్ చార్జ్ కమ్యునికేషన్స్ జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.
"అధికారంలో ఉన్నవాళ్లు దారుణమైన మాటలు, చేష్టలతో దేశంలో సామాజిక సామరస్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. పార్లమెంట్, న్యాయవ్యవస్థ, వర్సిటీలు, మీడియా, రాజ్యాంగ సంస్థలను అణచివేస్తున్నారు. భారత విలువలపై బహిరంగంగా దాడి చేస్తున్నారు. ఆర్థిక అసమానతలు పెరిగి సంపద కొద్దిమంది చేతుల్లోకి చేరింది. దేశంలో మాట్లాడే స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. మరి ఇన్ని లోపాలుంటే మన దేశం వికసిత్ భారత్ ఎలా అవుతుంది?" అని ఆయన నిలదీశారు.