చెత్త సినిమా డైలాగులు కాదు.. మా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి: ప్రధాని మోడీపై జైరాం రమేష్ ఫైర్

చెత్త సినిమా డైలాగులు కాదు.. మా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి: ప్రధాని మోడీపై జైరాం రమేష్ ఫైర్

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మరోసారి ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. బహిరంగ సభల్లో ప్రధాని మోడీ సినిమా డైలాగులు చెబుతారు. చెత్త సినిమా డైలాగులు చెప్పడం కాదు.. మా ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలి. పహల్గాం ఉగ్రదాడి జరిగి నెలరోజులు కావొస్తోన్న ఆ దాడికి పాల్పడిన టెర్రరిస్టులు ఇంకా స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారు..? ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ఎందుకు నిర్వహించడం లేదు..?

 భారత్, పాక్ పరిస్థితులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు..? ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కోరితే ఎందుకు నిర్వహించడం లేదు..? అని ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా-పాకిస్తాన్ మధ్య లోతైన సంబంధం స్పష్టంగా బయటపడ్డప్పటికీ 1994, ఫిబ్రవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించబడిన తీర్మానాన్ని సవరించడానికి ఎందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. 

అంతకుముందు ప్రధాని మోడీ రాజస్థాన్‎లోని బికనీర్‎లో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ప్రస్థావన తీసుకొచ్చారు. ఇది పాత భారత్ కాదు.. కొత్త భారత్.. ఎప్పుడేం చేయాలో సైన్యం నిర్ణయిస్తుందని అన్నారు. పాకిస్తాన్ కుట్రలు ఇక చెల్లవని.. న్యూక్లియర్ బాంబులకు బయపడేది లేదని తెగేసి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి 140 కోట్ల భారతీయుల హృదయాలను గాయపరిచిందని.. దీనికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్‎తో ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‎కు చుక్కలు చూపించామని హాట్ కామెంట్స్ చేశారు.

కేవలం 23 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ ముగిసిందని పేర్కొన్నారు. పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు చనిపోయారని..  ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు త్రివిధ దళాలకు స్వేచ్ఛనిచ్చినట్లు తెలిపారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భారత్ పై దాడి చేస్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్‎కు అర్ధమయ్యిందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలకు పై విధంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు.