తెలంగాణకు న్యాయం చేశాక.. దేశం గురించి ఆలోచించు

తెలంగాణకు న్యాయం చేశాక.. దేశం గురించి ఆలోచించు

సీఎం కేసీఆర్ తొలుత ఇంట గెలిచి..  ఆ తర్వాత రచ్చ గెలిచే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకోని కేసీఆర్.. దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులకు ఎగబడి సాయం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. తొలుత రాష్ట్రంలోని రైతులను ఆదుకోవడంపై దృష్టిపెట్టాలని కోరారు. గాంధీ భవన్ లో మీడియా తో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.  సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రజలకు న్యాయం చేశాక.. దేశం గురించి ఆలోచించాలన్నారు. ‘‘ఇప్పటిదాకా రాష్ట్రంలోని రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలే. యువతకు నిరుద్యోగ భృతి ఇస్త అన్నరు.. ఇయ్యలె. లక్ష 91వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయంటే.. కనీసం 30వేల ఖాళీలు కూడా ఇంకా నింపలే. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు’’ అని పొన్నం పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పులమయం , అవినీతి మయం చేశారని మండిపడ్డారు. జరగని అభివృద్ధిని జరిగినట్లుగా 3డీ షోను చూపించి.. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ సర్కారు ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ.. గతంలో కాంగ్రెస్ హయాంలో తెచ్చినవేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో పొలం దున్నినోడిని, దున్ననోడిని అందరినీ సమానం చేసే పరిస్థితిని తెచ్చింది కేసీఆరేనని వ్యాఖ్యానించారు. ‘‘ ప్రభుత్వ పథకాల నిధులు నావంటే నావని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకోవడం సిగ్గుచేటు.. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలి. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు లేవు’’ అని ఆయన పేర్కొన్నారు.