
- ఆధారాలు ఉంటే అఫిడవిట్ ఎందుకు?
- ఈసీపై ప్రియాంక గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్‌పై కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. దేశంలో ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ ఆధారాలతో సహా నిరూపిస్తే, ఈసీ దానిపై దర్యాప్తు చేపట్టకుండా అఫిడవిట్ అడగడమేంటి? అని ఆమె ఫైర్ అయ్యారు. శుక్రవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో మీడియాతో ప్రియాంక మాట్లాడారు. ‘‘ఓట్ల దొంగతనంపై రాహుల్ సంచలన విషయాలు బయటపెట్టారు. కానీ ఈసీ దానిపై దర్యాప్తు చేపట్టకుండా, అఫిడవిట్ ఇవ్వాలని రాహుల్‌ను అడుగుతున్నది.
దీనిపై అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రాహుల్ అన్ని ఆధారాలను బహిరంగంగానే చూపించారు. ఎవిడెన్స్ ఈసీ ముందే ఉంది. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టాలి. కానీ విచారణ చేయకముందే రాహుల్ ఆరోపణలు తప్పు అని ఎలా అంటారు?” అని మండిపడ్డారు. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఈసీపై ఎంతో పెద్ద బాధ్యత ఉంది. కానీ బీజేపీ చెప్పినట్టు చేయడమే తమ బాధ్యత అని ఈసీ అనుకుంటే.. దానిపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
ఏదో ఒకరోజు మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినోళ్లు.. భవిష్యత్తులో తప్పకుండా జవాబు చెప్పాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు. ఓట్ల దొంగతనంపై ఈసీ దర్యాప్తు చేపట్టి, దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈసీ జవాబు చెప్పాలి: శశిథరూర్
ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మద్దతుగా నిలిచారు. బీజేపీ, ఈసీ కుమ్మక్కయి ఓట్లను దొంగలించాయని రాహుల్ ఆరోపించగా.. ఇది చాలా తీవ్రమైన అంశమని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఈసీ వెంటనే స్పందించి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలు చాలా తీవ్రమైనవి.
అన్ని పార్టీలు, ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రజాస్వామ్యం చాలా విలువైనది. దాని విశ్వసనీయతను దెబ్బతీసే చర్యలను ఎన్నటికీ అనుమతించకూడదు. రాహుల్ ఆరోపణలపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. దీనిపై దేశ ప్రజలందరికీ సమాచారం అందించాలి’’ అని ‘ఎక్స్’లో థరూర్ పోస్టు పెట్టారు.