
- మోదీని, కమలం పార్టీని ఓడించి తీరుతాం
- ప్రధాని బెలూన్ పేలిపోతుందని కామెంట్
- ఓటమి భయంతోనే అయోధ్యలో పోటిచేయలేదని ఎద్దేవా
అహ్మదాబాద్: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్లో పట్టిన గతే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎదురవుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ప్రారంభించిన రామ మందిర ఉద్యమంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధించిందని, అదేవిధంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం అహ్మదాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ మాట్లాడారు.
‘‘లోక్ సభ ఎన్నికల సమయంలో వారు (మోదీ, అమిత్ షా) మమ్మల్ని బెదిరించారు, ఇబ్బందిపెట్టారు, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. మా ఆఫీసులపై దాడులు చేయించారు. అయినా, మేము బెదరలేదు. వారు మా ఆఫీసులపై దాడులు చేసిన విధంగానే బీజేపీ ప్రభుత్వాన్ని మనమంతా కలిసికట్టుగా కూల్చిపారేయాలి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీని, బీజేపీని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఓడించి తీరుతుంది.
గుజరాత్ నుంచే కొత్త మార్పు ప్రారంభం అవుతుంది. మోదీ బెలూన్ పేలిపోతుంది” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘తనకు దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని మోదీ అన్నారు. అందరూ పుట్టినట్లే తాను పుట్టలేదని, తాను నాన్ బయోలాజికల్ అని చెప్పారు. దీంతో మీరు మనిషా? కాదా? అని పార్లమెంటులో మోదీని నేను ప్రశ్నించా. మీకు (మోదీ) దేవుడితో డైరెక్టుగా సంబంధం ఉంటే, అయోధ్యలో ఎలా ఓడిపోయారని అడిగా” అని రాహుల్ పేర్కొన్నారు.
కొన్ని పొరపాట్ల వల్ల వారణాసిలో ఓడిపోయాం
మోదీ అయోధ్యలో పోటీచేయాలనుకున్నారని.. అయితే, పరిస్థితులు అనుకూలంగాలేవని సర్వేలు చెప్పడంతో వెనక్కి తగ్గారని రాహుల్ పేర్కొన్నారు. ‘మేము కొన్ని పొరపాట్లు చేసి ఉండకపోతే, వారణాసిలో కచ్చితంగా మోదీని ఓడించి ఉండేవాళ్లం’ అని రాహుల్ చెప్పారు. అయోధ్య ప్రజలు మోదీపై కోపంగా ఉన్నారని, రామ మందిర నిర్మాణానికి ఇండ్లు, షాపులు, భూములు ఇచ్చిన బాధితులకు ప్రభుత్వం ఇంకా పరిహారం చెల్లించలేదని అన్నారు.
‘‘విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతుల కు ఇంకా పరిహారం ఇవ్వలేదని అయోధ్య ఎంపీ నాకు చెప్పారు. అలాగే, మందిరం ప్రారంభోత్సవంలో అంబానీ, అదానీ వంటి సెలబ్రిటీలను ఆహ్వానించారు. కానీ, అయోధ్యకు చెందిన ఏ ఒక్క వ్యక్తిని కూడా పిలవలేదు. ఈ కసి అంతా వారు లోక్ సభ ఎన్నికల్లో చూపించారు” అని రాహుల్ చెప్పారు.
కార్మికుల భవితకు ప్రమాదం
నరేంద్ర మోదీ హయాంలో దేశంలోని కార్మికుల భవిత ప్రమాదంలో పడిందని రాహుల్ అన్నారు. కార్మికులకు హక్కులు, గౌరవం దక్కేలా చూస్తామ ని ట్వీట్ చేశారు. ‘కార్మికులు దేశ నిర్మాతలు. మోదీ హయాంలో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. భయంకరమైన కష్టాలు ఎదుర్కొంటు న్నారు. రోజువారీ కార్మికులు తాము సంపాదించిన ఒకరోజు సంపాదనతో నాలుగు రోజులు ఇల్లు గడుపు కోవాల్సి న పరిస్థితి తయారైంది. వారు సంపాదించిదంతా ఖర్చులకే పోతోం ది. రూపాయి కూడా ఆదా కావడం లేదు” అని రాహుల్ ట్వీట్ చేశారు.