
దౌసా: వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కోసమే ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ ‘భారత్ మాత కీ జై’ అనే బదులు ‘అదానీ కీ జై’ అనాలని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బందీ, దౌసా జిల్లాలో జరిగిన ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. మోదీపై విమర్శలు గుప్పించారు. అదానీ కోసం ఒకటి, పేదల కోసం మరొక దేశం, అలా రెండు భారత్ లను రూపొందించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దేశంలో కులాలవారీగా లెక్కలు తీయాలని తాము ఎన్నిసార్లు డిమాండ్ చేసినా బీజేపనీ సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే కుల గణన చేపడతామన్నారు. దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తలలో బీసీ, దళితులు, గిరిజన వర్గానికి చెందినవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. నిజంగానే ఆ వర్గాలకు చెందిన వారు బడా వ్యాపారుల్లో ఉన్నట్లు చూపితే.. తాను ప్రసంగాలను ఆపేస్తానన్నారు.
రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వస్తే గెహ్లాట్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలన్ని ఆగిపోతాయని హెచ్చరించారు. మోదీ 90 మంది ఐఏఎస్ లతోనే దేశాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. ఈ అధికారుల్లో ముగ్గురు మాత్రమే బీసీ వర్గాలకు చెందినవారని అన్నారు.