త్యాగాల ఫలితమే స్వేచ్ఛ.. ఈ వారసత్వాన్ని కాపాడుకోవాలి: రాహుల్ గాంధీ

త్యాగాల ఫలితమే స్వేచ్ఛ.. ఈ వారసత్వాన్ని కాపాడుకోవాలి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కాంగ్రెస్​పార్టీ హెడ్​క్వార్టర్‌‌‌‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్​చీఫ్​ మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఇందిరా భవన్‎లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్​అగ్రనేత, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ, అజయ్​ మాకెన్‌‌తో పాటు పలువురు కాంగ్రెస్​నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జెండా వందనం చేసి, జాతీయ గీతాలాపన చేశారు. వర్షంలో తడుస్తూ రాహుల్​గాంధీ జెండా వందనం చేశారు. అనంతరం సోషల్​మీడియా వేదికగా దేశ ప్రజలకు రాహుల్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మన స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాల ఫలితం ఈ స్వేచ్ఛ. ఇది స్వాతంత్ర్యం మాత్రమే కాదు.. నిజాయితీ, సమానత్వం అనే పునాదిపై న్యాయం నిలిచేలా.. అద్భుతమైన భారత్‌‌ను నిర్మించాలనే సంకల్పం కూడా. ప్రతీ హృదయం గౌరవం, సోదరభావంతో నిండి ఉండాలి. ఈ విలువైన వారసత్వ గౌరవాన్ని కాపాడటం మనందరి కర్తవ్యం. జై హింద్, జై భారత్” అని  ట్వీట్​ చేశారు.   

ఇండిపెండెన్స్​ డే ఒక ప్రత్యేక సందర్భం: ఖర్గే

స్వాతంత్ర్య ఉద్యమంలో త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తులకు తాను తలవంచి నమస్కరిస్తున్నట్టు ఖర్గే తెలిపారు. మన ప్రజాస్వామ్యం ప్రతిష్టాత్మకంగా భావించే స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలకు మనల్ని మనం తిరిగి అంకితం చేసుకోవడానికి ఇండిపెండెన్స్​డే ఒక పవిత్ర సందర్భం అని పేర్కొన్నారు.

 జెండా ఆవిష్కరణ తర్వాత మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ ఇండిపెండెన్స్​డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ..అధికారం కోసం బీజేపీ ఎంత అనైతికతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పారు. 

బిహార్‌‌‌‌లో ఓటర్ల సమగ్ర జాబితా సవరణ(సర్) పేరుతో ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని, బతికి ఉన్నవారిని చనిపోయినట్లు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఎన్నికల్లో గెలవడానికి కాదు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గెలిపించేందుకు ఉద్యమిస్తున్నం” అని  తెలిపారు.

బీజేపీ విమర్శలు

ఎర్రకోటలో వేడుకలకు రాహుల్, ఖర్గే హాజరుకాకపోవడంపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్​ పూనావాలా తప్పుబట్టా రు. ‘‘మోదీపై విరోధాన్ని దేశం, సైన్యంపై చూపిస్తారా..? జాతీయ వేడులకు పాక్​ప్రేమికుడు (రాహుల్) హాజరుకాక పోవడం విచారకరం’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదేనా రాజ్యాంగం, సైన్యానికి మీరిచ్చే గౌరవమని రాహుల్, ఖర్గేలను ప్రశ్నించారు.