రాహుల్ ఒక యోగి అంటూ కాంగ్రెస్​ లీడర్​ సల్మాన్​ ఖుర్షిద్ ​పొగడ్తలు

రాహుల్ ఒక యోగి అంటూ కాంగ్రెస్​ లీడర్​ సల్మాన్​ ఖుర్షిద్ ​పొగడ్తలు

మొరాదాబాద్: కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్ గాంధీని రాముడితో పోలుస్తూ ఆ పార్టీ లీడర్​ సల్మాన్ ​ఖుర్షిద్​ వివాదాస్పద కామెంట్లు చేశారు. కాంగ్రెస్​ కార్యకర్తలంతా ఆయన సోదరుడు భరతుడి వంటి వారన్నారు. భారత్​ జోడో యాత్ర చేస్తున్న రాహుల్​ ఒక సూపర్​ హ్యూమన్​ అని, ఆయన తపస్సు చేస్తున్న యోగి లాంటి వారని కొనియాడారు. ఉత్తరప్రదేశ్​లో రాహుల్​ యాత్రకు ఖుర్షిద్​ కోఆర్డినేటర్​గా ఉన్నారు. రాహుల్​ పాదయాత్ర ఉత్తరప్రదేశ్​ మీదుగా వెళ్లకపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ కామెంట్లు చేశారు.

‘‘రాహుల్​గాంధీ సూపర్​ హ్యూమన్. ఎముకలు కొరికే చలిలో మనమంతా జాకెట్లు, స్వెట్టర్లు వేసుకుంటుంటే.. రాహుల్(భారత్ జోడో యాత్ర కోసం)​ టీషర్టుతోనే బయట తిరుగుతున్నారు. ఆయన యోగి లాంటివాడు. అందుకే ఆయన తనను తాను అలా పిలుచుకుంటున్నారు. తన దృష్టి మొత్తం కేంద్రీకరించి 'తపస్సు' చేస్తున్నారు”అని అన్నారు. ‘‘రాముడి పాదుకలు చాలా దూరం ప్రయాణించాయి. కొన్ని సమయాల్లో రాముడు వెళ్లలేని చోటుకు ఆయన  పాదుకలు భరతుడు తీసుకెళ్లాడు. అలాగే ఇప్పుడు ఆ పాదుకలు ఉత్తరప్రదేశ్​ చేరుకున్నాయి. రాముడు కూడా ఇక్కడికి వస్తారు. అదే మా నమ్మకం”అని చెప్పారు.

రాహుల్​ పాదయాత్ర జనవరి 3న ఉత్తరప్రదేశ్​లో ప్రవేశించనుంది. గజియాబాద్​ నుంచి మొదలయ్యే యాత్ర బాగ్​​పట్.. షామ్లీ మీదుగా హర్యానాలోకి ప్రవేశిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా పాదయాత్రను వాయిదా వేసుకోవాలన్న కేంద్ర మంత్రి మన్​సుఖ్​ మాండవీయ సూచనపై ఖుర్షిద్​ స్పందిస్తూ.. రాహుల్​ యాత్ర కరోనా గైడ్​లైన్స్​ ప్రకారమే కొనసాగుతుందని చెప్పారు. రాహుల్​ను రాముడితో పోల్చడంపై బీజేపీ మండిపడింది. ప్రపంచమంతా కొలిచే మహాపురుషునితో రాహుల్​ను పోల్చడం సరికాదని బీజేపీ అధికార ప్రతినిధి హరిశ్చంద్ర శ్రీవాస్తవ అన్నారు.