
- కాంగ్రెస్ నేత శశి థరూర్‌ను మెచ్చుకుంటూ ట్వీట్లు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లను దేశ పౌరుడిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తిప్పికొట్టాల్సింది పోయి.. సమర్థించడం దేశ ప్రజల ఆకాంక్షలను, విజయాలను అవమానించడమేనని బీజేపీ మండిపడింది. ఆ పార్టీ సీనియర్ లీడర్ అమిత్ మాలవ్యా మాట్లాడుతూ ట్రంప్ మాటలను రాహుల్‌గాంధీ సమర్థించడమంటే దేశ ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని ఆయన హేళన చేయడమేనని అన్నారు. ‘‘రాజకీయ లబ్ధికోసమే రాహుల్ ఇలా దిగజారి మాట్లాడుతున్నారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ ఇండియాదని ఇప్పటికే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు కూడా గుర్తించాయి. భారత్‌పై దాడి చేయాలనుకుంటున్న విదేశీ శక్తులకు రాహుల్ వంతపాడుతున్నారు” అని మాలవ్యా వ్యాఖ్యానించారు.
అలాగే, తమిళనాడు బీజేపీ లీడర్ అన్నామలై కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. ట్రంప్ కామెంట్లను తిప్పికొట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తో రాహుల్ వ్యాఖ్యలను పోలుస్తూ ‘ఎక్స్’ లో ఆయన పోస్టు చేశారు. ‘‘భారత ఎకానమీ డెడ్ అయిందని రాహుల్ అంటున్నారు. ఆయన పార్టీకే చెందిన శశిథరూర్ మాత్రం వేరేరకంగా స్పందించారు. ఒకరు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడితే, మరొకరు దేశ ప్రయోజనాల కోసం మాట్లాడారు. దేశం ఎదుగుతుంటే రాహుల్ చూడలేకపోతున్నారు. విదేశీ శక్తులకు ఆయన వంతపాడి దేశ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు” అని అన్నామలై అన్నారు.