
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్నేతల పర్యటన
- అధైర్యపడొద్దని రైతులకు భరోసా
నిర్మల్, వెలుగు: వర్షాలు, వరదల కారణంగా పంటలు, ఆస్తులు నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని నిర్మల్ డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు హామీ ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలు, రోడ్లను ఆదివారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికే వరద నష్టం అంచనాలు రూపొందించిందని, ఈ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు.
జిల్లాలో జరిగిన నష్టంపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించారని తెలిపారు. శ్రీహరిరావు వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులున్నారు.
వరద బాధితులను ఆదుకుంటాం
జన్నారం రూరల్, వెలుగు: వరద బాధితులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. భారీ వానలతో అతలాకుతలమైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఆదివారం ఆమె పర్యటిం చారు. తిమ్మాపూర్, రాంపూర్, తపాలాపూర్ గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి బాధితులతో మాట్లాడారు.
ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇండ్లు కూలిపోయివారికి ఇందిరమ్మ ఇండ్లు, దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందజేస్తామని చెప్పారు. నాయకులు చిందం చంద్రయ్య, ప్రదీప్, కోవా శాంతయ్య, గుగులావత్ రవి, కనక వెంకటేశ్, గుండా లచ్చయ్య, కోవా భూమయ్య, శంకరయ్య, జాడి రాజన్న, గోలకొండ రాజన్న, దాసరి వెంకటేశ్, చిందం ముత్తయ్య తదితరులున్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: వర్షాలకు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ ఆదిలాబాద్నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనథ్ మండలంలోని పెండల్వాడ, ఆనంద్పూర్, సాంగ్వి, కరంజి గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం ఆయన నాయకులతో కలిసి పర్యటించారు. వరదలకు పాడైన రోడ్లు, వంతెనలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నాయకులు గిమ్మ సంతోష్, భూమారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, జైనథ్ ఆలయ కమిటీ చైర్మన్ రుకేశ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, రాకేశ్, అశోక్, విఠల్, కాప్రి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.