గ్రామాల్లో శాంతినెలకొల్పాలనేదే భట్టి సంకల్పం : నూతి సత్యనారాయణ

 గ్రామాల్లో శాంతినెలకొల్పాలనేదే భట్టి సంకల్పం : నూతి సత్యనారాయణ
  • కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ 

మధిర, వెలుగు:  గ్రామాల్లో శాంతినెలకొల్పాలని సంకల్పంతో ఉన్న మహోన్నతమైన వ్యక్తి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అని,  సీపీఎం నిరసన ర్యాలీ అని చెప్పి ఆయనను తూలనాడటం ప్రజలు సహించబోరని, ఈ ర్యాలీని అభివృద్ధి, ప్రజాస్వామ్యంపై దాడిగా ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ అన్నారు. శనివారం మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కేశవ్​భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

 ఖమ్మం జిల్లాలో హత్యారాజకీయాలకు పెట్టింది పేరు సీపీఎం అని, తెల్దారుపల్లి, పాతర్లపాడు గ్రామాల్లో జరిగిన ఘటనలను కాంగ్రెస్​ పార్టీకి పూయాలని చూస్తున్నారని ఆరోపించారు. భట్టి విక్రమార్క శాంతికాముకుడని, ప్రజాస్వామ్యవాది అనే పేరు ఉందని గుర్తుచేశారు. ఆయన  రైతాంగం, విద్యా,  వైద్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్,  పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకట రమణగుప్త, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు,  నాయకులు  పాల్గొన్నారు.