15 వేల మంది అప్లై చేసుకుంటే.. 600 డబుల్​ బెడ్​రూం ఇండ్లే కడతరా?

15 వేల మంది అప్లై చేసుకుంటే.. 600 డబుల్​ బెడ్​రూం ఇండ్లే కడతరా?

కరీంనగర్, వెలుగు:  తొమ్మిదేండ్లు గడిచినా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేని గంగుల కమలాకర్ ఏ విధంగా సక్సెస్ ఫుల్ మంత్రి అవుతారో ప్రజలకు చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం చింతకుంటలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సందర్శనకు పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను ఆదివారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు.  

ఈ సందర్భంగా పొన్నం.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేనేని రోహిత్ రావు, ఇతర లీడర్లు చింతకుంటలోని ఇండ్ల వద్దకు వెళ్లగా పోలీసులు అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి తొమ్మిదేండ్లు గడిచినా నియోజకవర్గంలో ఎక్కడా ఇవ్వలేదని , నిర్మాణాలు పూర్తి చేయలేదని ఆరోపించారు. 

మంత్రి గంగుల కమలాకర్ కు ఫామ్ హౌస్ లు, విదేశీ పర్యటనలు, పార్టీ కార్యాలయాల నిర్మాణంపై ఉన్న శ్రద్ధ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కరీంనగర్ నియోజకవర్గంలో 15 వేల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే తొమ్మిదేండ్లలో కట్టింది కేవలం 660 ఇండ్లేనని, వాటిని కూడా ఇప్పటివరకు పేదలకు పంచలేదని విమర్శించారు. 

డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సమద్ నవాబ్,  ఎండీ తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కొరివి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.