రాష్ట్రపతికి అధిర్ రంజన్ క్షమాపణ లేఖ

రాష్ట్రపతికి అధిర్ రంజన్ క్షమాపణ లేఖ

న్యూఢిల్లీ: క్షమాపణ కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ లోక్ సభా పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు. తాను రాష్ట్రపతికి బదులుగా పొరపాటున రాష్ట్రపత్ని అని అన్నానని వివరణ ఇచ్చారు. రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశంతో అలా అనలేదన్న ఆయన... పొరపాటున నోరు జారానని లేఖలో పేర్కొన్నారు. అందుకు తనను క్షమించాలని రాష్ట్రపతిని అధిర్ రంజన్ కోరారు. 

సోనియాగాంధీ ఈడీ విచారణ, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం నిరసన చేపట్టారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వద్దకు వచ్చిన ఓ జర్నలిస్టు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించగా... రాష్ట్రపత్ని భవనానికి అని నోరు జారారు. ఈ వ్యాఖ్యలు కాస్తా మీడియాలో ప్రసారం కావడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అధిర్ రంజన్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నాయకులు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు అధిర్ రంజన్ పై విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలోనే వారంతా అధిర్ రంజన్ రాష్ట్రపతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ అధిర్ రంజన్ రాష్ట్రపతికి క్షమాపణ కోరుతూ లేఖ రాశారు.