కాంగ్రెస్ మేనిఫెస్టో..గెలుపు మంత్రమేనా!

కాంగ్రెస్ మేనిఫెస్టో..గెలుపు మంత్రమేనా!

18వ  లోక్​సభ ఎన్నికలలో గెలిచి తీరాల్సిన అనివార్యత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది.  గత దశాబ్ద కాలంగా  కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని హ్యాట్రిక్ విజయం సాధించకుండా అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో  కేంద్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ న్యాయ్​పత్ర పేరుతో తన మేనిఫెస్టోని ప్రకటించింది. కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్,  శ్రామిక న్యాయ్, యువ న్యాయ్, హిస్సేదారి న్యాయ్​ను మేనిఫెస్టోలో పేర్కొంది.  పంచన్యాయ్​లో  భాగంగా పచ్చీస్ గ్యారంటీలను  ప్రజలకు హామీగా ఇస్తోంది. 

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ  వరుసగా ఒక దశాబ్దం పాటు కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది.  కాబట్టి, ఈ లోకసభ ఎన్నికలలో  గెలుపే లక్ష్యంగా ఒకవైపు ఇండియా కూటమిని ఏర్పాటు చేసి, వివిధ వర్గాల ప్రజలని లక్ష్యంగా చేసుకొని న్యాయ్​పత్ర రూపంలో బలమైన మేనిఫెస్టోని రూపొందించినట్లుగా కనిపిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికలలో  ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీకి  వివిధ రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో వరుసగా పరాజయాలే ఎదురయ్యాయి. నిరాశ నిస్పృహలలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విజయం మళ్ళీ ఊపిరి పోసిందనే చెప్పాలి.  హిమాచల్ ప్రదేశ్ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తలు తమ ఎన్నికల అజెండాను మేనిఫెస్టో  విధానాన్ని మార్చుకున్న ఫలితంగానే ఐదు గ్యారంటీలతో  కర్ణాటకలో, 6 గ్యారంటీలతో  తెలంగాణలో కాంగ్రెస్  పార్టీ విజయం సాధించింది.  రెండు రాష్ట్రాల గెలుపులో  గ్యారంటీల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆ పార్టీని గెలిపించాయని హస్తం పార్టీ విశ్వసిస్తోంది.  దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికలలో కూడా విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ న్యాయ్​పత్ర రూపంలో పంచ న్యాయాలలో భాగంగా 25 గ్యారంటీలను ప్రజల ముందు పెట్టి గెలుపు వ్యూహాలను రూపొందించింది. 

మహిళలకు పెద్దపీట

ఒక్కొక్క న్యాయ్​లో ఐదు గ్యారంటీలు అంటే మొత్తంగా రైతులకి, మహిళలకు, యువకులకు, శ్రామికులకు, అట్టడుగు వర్గాలకి (హిస్సేదారి) 25 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీగా ప్రకటించింది. మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించినట్లుగా కనిపిస్తున్నది. మొత్తం దేశంలో ఉన్న ఓటర్లలో  సగభాగమైన మహిళల కోసం నారీ న్యాయ్​ని రూపొందించింది. మహిళలకు హామీగా ఇస్తున్న ఐదు గ్యారంటీలలో సంవత్సరానికి మహిళలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం,  కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో  మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు,  మహిళా ఓట్లపై ప్రభావం చూపించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.  మధ్యప్రదేశ్ లో లాడ్లీ బెహన్, కర్ణాటక, తెలంగాణలలో  మహాలక్ష్మి పథకాల ప్రభావంతోనే ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో పార్టీలు గెలిచాయి అనే విషయాన్ని గమనించాలి.  ఉత్తర భారత దేశంలో భారతీయ జనతా పార్టీపై  రైతాంగంలో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మలుచుకోవటానికి కాంగ్రెస్ పార్టీ కిసాన్ న్యాయ్​ని ప్రకటించింది.  కిసాన్ న్యాయ్​లో భాగంగా రైతులకు ఇచ్చిన ఐదు గ్యారంటీలలో దేశవ్యాప్తంగా రైతుల రుణాల మాఫీ,  మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం, పంటల బీమాని బ్యాంకుల ద్వారా 30  రోజులలో అందజేయటం,  వ్యవసాయ  పరికరాలపై జీఎస్టీ రద్దు లాంటివి కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కలిసి వచ్చే అంశాలు. 

అట్టడుగు వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత

మహిళలు, యువకులు, రైతులు పేదల పైన బీజేపీ దృష్టి పెడితే కాంగ్రెస్ పార్టీ పంచ్ న్యాయ్​లో భాగంగా  మహిళలు,  రైతులు, యువకులు, శ్రామికులు, అట్టడుగు వర్గాలపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది.  లోక్ సభ ఎన్నికలలో మోదీ సారథ్యంలో బలమైన బీజేపీని ఎదుర్కోటానికి  ఒక బలమైన మేనిఫెస్టోని  కాంగ్రెస్ పార్టీ రూపొందించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ  మేనిఫెస్టోని ప్రజలలోకి తీసుకుపోగలిగితే  కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బలమైన రాజకీయ చాలెంజ్ విసరగలుగుతుంది.  కాంగ్రెస్ పార్టీ  మేనిఫెస్టోపై  కమలనాథులు నుంచి అప్పుడే  విమర్శలు ప్రారంభమైనాయి.  కాంగ్రెస్  మేనిఫెస్టోని అమలు చేయాలంటే  కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో డబ్బులను ముద్రించే యంత్రాలను ఏర్పాటు చేయాలని  కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.  రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా  బీజేపీది అభివృద్ధి మంత్రం అయితే  కాంగ్రెస్ పార్టీది సంక్షేమ మంత్రం అని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ద్వారా మరొకసారి తన అజెండాని స్పష్టం చేసింది.  అభివృద్ధి ఒక దీర్ఘకాలిక ప్రక్రియ అది కాలంతో పాటు మారుతుంటుంది. కానీ, అట్టడుగు వర్గాల  భద్రతకి, సంక్షేమానికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.  అది నిరంతరం కొనసాగాల్సిన ప్రభుత్వాల సామాజిక బాధ్యత.  ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు ఉచితాల మాటున తప్పించుకోలేవు.  అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన మేనిఫెస్టోనే  ప్రజల ముందు పెట్టిందని చెప్పాలి. 

30లక్షల ఉద్యోగాల భర్తీ

దేశంలో మరొక ప్రధాన వర్గమైన యువ ఓటర్లను ఆకర్షించడానికి యువ న్యాయ్​లో ఇచ్చిన 30 లక్షల ఉద్యోగాల భర్తీ, అంకుర పరిశ్రమల కోసం 500 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్, అగ్నిపథ్​ రద్దు లాంటి గ్యారంటీలతో  యువత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గటానికి అవకాశం ఉన్నది. కాంగ్రెస్  పార్టీ  ప్రకటించిన  పంచ న్యాయ్​లో సామాజిక న్యాయం కోసం ప్రకటించిన హిస్సేదారి న్యాయం కూడా దేశంలోని మెజార్టీ వర్గాలైన అట్టడుగు వర్గాలు బీసీ, ఎస్సీ ఎస్టీ వర్గాలపై ప్రభావం చూపనున్నది.  హిస్సేదారి  న్యాయ్ లోని  దేశవ్యాప్త  కులగణన రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయటం, జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు  ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు దానికి చట్టబద్ధత లాంటి గ్యారంటీలు అట్టడుగు వర్గాలలో  కాంగ్రెస్ పార్టీకి మరింత పాపులారిటీని పెంచే అవకాశాలు లేకపోలేదు.  కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలలో గెలుపు కోసం ప్రధానంగా మహిళలు, రైతులు అట్టడుగు వర్గాలు, యువతపైన దృష్టి సారించింది.  ప్రధాని  నరేంద్ర మోదీ కూడా అనేక సందర్భాలలో  దేశంలో అన్నదాత, నారి, యువ, గరీబ్ నాలుగు కులాలు ఉన్నాయి. ఈ నాలుగు కులాల అభ్యున్నతే  మోదీ గ్యారంటీ అని చెపుతున్నారు. కేంద్ర  ప్రభుత్వం  ప్రవేశపెట్టిన బడ్జెట్​లో  కూడా ఈ నాలుగు వర్గాలు కులాలపై  దృష్టి పెట్టారు అనే విషయాన్ని గమనించాలి.

- డాక్టర్ తిరునహరి శేషు,
పొలిటికల్ ఎనలిస్ట్,
కాకతీయ యూనివర్సిటీ