రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌ను రికార్డుల‌లో ఎందుకు ఎక్కించడం లేదు?

రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌ను రికార్డుల‌లో ఎందుకు ఎక్కించడం లేదు?

హైదరాబాద్: తెలంగాణ వచ్చాక కూడా రైతు ఆత్మహత్య లు జరుగుతున్నాయంటే.. అందుకు టీఆర్ఎస్ నేత‌లు సిగ్గుప‌డాల‌న్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గాంధీభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం త‌మ రికార్డు లలో చూపడం లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు రైతు ఆత్మహత్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని అన్నారు. తెలంగాణ వస్తే..రైతు ఆత్మహత్యలు ఉండవని కేసీఆర్ వేల సార్లు సభలలో చెప్పారని, అందుకే రైతు ఆత్మహత్యల ను రికార్డ్ లోకి ఎక్కించడం లేదని, రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ అంటే ఇదేనా అని ప్ర‌శ్నించారు. రైతులు చనిపోతే ప్ర‌భుత్వం పరిహారం ఇచ్చే స్కీం పెట్టింది కానీ బతికి ఉండటానికి ఎందుకు పెట్ట‌డం లేద‌ని అన్నారు. శుక్ర, శ‌ని రెండు రోజుల్లో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.

రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నా..ప్రజలు మమ్మల్ని నమ్మలేదని, టీఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ అని ప్ర‌చారం చేసి అధికారంలోకి వ‌చ్చింద‌ని, రెండో సారి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్నా రుణమాఫీ ఊసేలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతు లను మభ్యపెడుతుందని అన్నారు. ఏదో ఒక‌రోజు రైతు ల శాపం తగిలి టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కుటుంబం పతనం అవుతుందని అన్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికలున్నాయని వరద బాధితులకు 500 కోట్లు పరిహారం ఇచ్చారని.. మరి రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని నిలదీశారు. వ‌ర్షాల కార‌ణం న‌ష్ట‌పోయిన రైతుల‌కు ఎకారాకు 20 వేల చొప్పున అన్ని పంటలకు నష్ట పరిహారం ఇవ్వాల‌ని, లేదంటే రైతులతో కలిసి వచ్చి ప్రగతి భవన్ ముందు దీక్షకు దిగుతానని జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.