కేసీఆర్ ​అసెంబ్లీకి రాకుండా​..నల్గొండ సభ పెట్టడం సిగ్గుచేటు : మదన్​మోహన్ ఫైర్​​

కేసీఆర్ ​అసెంబ్లీకి రాకుండా​..నల్గొండ సభ పెట్టడం సిగ్గుచేటు :  మదన్​మోహన్ ఫైర్​​

హైదరాబాద్, వెలుగు :  గత పదేండ్లలో బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని కాంగ్రెస్​ఎమ్మెల్యే మదన్​మోహన్​ విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్​మళ్లీ ప్రజల్ని మభ్యపెట్టడానికి నల్గొండలో సభ నిర్వహించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద ఎమ్మెల్యే రామచంద్రనాయక్​, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మాట్లాడారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు అంటూ వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని, తుగ్లక్​పనిచేసిన కేసీఆర్.. అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చుక్కనీరు కూడా రాలేదని అన్నారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కేటీఆర్, హరీశ్​రావుకు ఇంకా మత్తు దిగడం లేదన్నారు.  కేసీఆర్ నిజమైన తెలంగాణ వాది కాదు కాబట్టే అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నా ప్రతిపక్షనేతగా సభకు హాజరు కావడం లేదని విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం కృష్ణాజలాలను కేసీఆర్​ఆంధ్రాకు తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్​విమర్శించారు. నిజాయితీ ఉంటే కేసీఆర్​అసెంబ్లీకి రావాలని సవాల్ ​విసిరారు.