నల్లగొండ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైరయ్యారు. ఏప్రిల్ 5 కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే వేముల వీరేశం ఖండించారు. కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయన్నారు. ఈ మేరకు ఆయన నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్, జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బొందల గడ్డలుగా మార్చారన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లను చూసి కెసిఆర్ మైండ్ బ్లాక్ అయి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రిపై నిత్యం శాపనార్థాలు పెడుతూ అబద్దాలు చెబుతూ కెసిఆర్ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు వేముల వీరేశం. తన బిడ్డ కవిత అరెస్టు గురించి కానీ, ప్రధానమంత్రి మోడీ గురించి కాని ఒక్క మాట మాట్లాడలేదని.. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు.. ఇకనైనా పద్ధతి మార్చుకొవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ జిల్లా రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఎమ్మెల్యే వేముల ధీమా వ్యక్తం చేశారు.