మధ్యంతర భృతి ఇవ్వకుండా కావాలనే లేట్

మధ్యంతర భృతి ఇవ్వకుండా కావాలనే లేట్

జగిత్యాల: తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగ ఖాళీలు పెరిగాయో, తగ్గాయో సీఎం కేసీఆర్ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 1.7 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని స్వయంగా కేసీఆర్ ఓ సభలో చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. తాజాగా బిశ్వాల్ కమిటీ రిపోర్టు లక్షా 97 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. మరి ఇన్నేళ్లలో ఉద్యోగాలు తగ్గినట్లా, పెరిగినట్లా అని క్వశ్చన్ చేశారు. మధ్యంతర భృతి విషయంలో ఉద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఏంటో కేసీఆర్‌కే తెలియాలన్నారు. 

‘వేతన, భత్యాల సవరణ అనేది పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా చేసేదే తప్ప.. అదేదో మెహర్బానీ కాదు. ప్రతీ ఐదేళ్లకోసారి ఈ ప్రక్రియ చేపట్టాలి. అటువంటిది మే 2018లో పీఆర్సీ ముగిస్తే.. కొత్త పీఆర్సీ జూన్ 1, 2018 నుంచి అమల్లోకి రావాలి. పీఆర్సీ కమిటీ వేసినప్పుడు మధ్యంతర భృతినీ ఇస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తూ.. తెలంగాణలో మూడేళ్ల నుంచి ఆ మధ్యంతర భృతికీ దొరగారు దిక్కులేకుండా తాత్సారం చేశారు. కొత్త పీఆర్సీ కూడా 2018 జూన్ 1 నుంచి అమలు కావల్సి ఉండగా.. 2021, ఏప్రిల్ 1 నుంచి కల్పిస్తామని ప్రభుత్వం అంటోంది. అంటే ఆ మధ్యకాలంలో ఉద్యోగులు పొందాల్సిన లబ్ధి హుష్ కాకి అన్నమాట. పైగా ఒక ఏడాదికి సంబంధించి బాకీ పీఆర్సీ భత్యాన్ని పదవీ విరమణ సమయంలో ఇస్తామంటున్నారు. ఐదేళ్లకు ఇవ్వాల్సిన పీఆర్సీలో మూడేళ్లకు కావల్సింది ఎగ్గొట్టి.. రెండేళ్ల పీఆర్సీ ఇస్తామంటున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌‌లో మెంబర్‌‌గా సభ్యత్వం ఇవ్వడంతోనే కారం రవీందర్ రెడ్డి లాంటివాళ్లు చల్లబడిపోయారు. మిగిలిన ఉద్యోగులను బలిపెట్టే హక్కు కారం రవీందర్‌కు ఎవరిచ్చారు?’ అని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.