
హైదరాబాద్, వెలుగు: కవిత ఇప్పుడు బయటకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై కవిత సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆ ఐదుగురు కలిసి జలగల్లా దోచుకున్నారని, అందులో కవిత కూడా ఉన్నారని చామల ఆరోపించారు.
దోచుకున్న సోమ్ములో వాటాల పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కవిత బయటకు వచ్చారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో దోషులను కఠినంగా శిక్షించాలనే చిత్తశుద్ధి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు ఉన్నట్లయితే.. విచారణను వేగంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. కవిత ఎపిసోడ్‌లో హరీశ్‌రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉంటే.. కాళేశ్వరంపై కమిషన్‌ను ఎందుకు వేస్తారని, సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశిస్తారని చామల ప్రశ్నించారు.