అబ్ కీ బార్ 400 పార్ జరిగింది..కానీ వేరే దేశంలో!

అబ్ కీ బార్ 400 పార్ జరిగింది..కానీ వేరే దేశంలో!
  • బీజేపీపై శశిథరూర్‌‌‌‌ సెటైరికల్ ట్వీట్

న్యూఢిల్లీ: బ్రిటన్‌‌‌‌ ఎన్నికల రిజల్ట్స్​ను పోలుస్తూ కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ శశిథరూర్‌‌‌‌ బీజేపీపై ఆసక్తికర విమర్శలు చేశారు. ‘భారత్​లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవలేకపోయింది.. కానీ, యూకేలో లేబర్ పార్టీ 412 సీట్లతో ఈ ఘనత సాధించింది’ అని శశి థరూర్ హాస్యాస్పదంగా పేర్కొన్నారు. ‘మొత్తానికి బీజేపీ అబ్‌‌‌‌ కీ బార్‌‌‌‌ 400 పార్‌‌‌‌’ సాధ్యమైంది.. కానీ భారత్‌‌‌‌లో కాదు.. వేరే దేశంలో’ అని ఎక్స్‌‌‌‌ వేదికగా బీజేపీపై సెటైర్‌‌‌‌ వేశారు. బ్రిటన్‌‌‌‌ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్‌‌‌‌ పార్టీ ఘన విజయం సాధించింది. 650 మంది సభ్యులున్న హౌస్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామన్స్‌‌‌‌లో 412 స్థానాలను కైవసం చేసుకుంది.

కేవలం 121 స్థానాలతో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌‌‌‌ ఎన్నికలను ప్రస్తావిస్తూ శశిథరూర్‌‌‌‌ బీజేపీపై విమర్శలు గుప్పించారు. భారత్​లో లోక్‌‌‌‌సభ ఎన్నికల సమయంలో ‘అబ్‌‌‌‌ కీ బార్‌‌‌‌.. 400 పార్‌‌‌‌’  అంటూ బీజేపీ నేతలు హోరెత్తించారు. ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే, వారి అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ సొంతంగా 240 సీట్లు మాత్రమే సాధించగలిగింది. కూటమి పార్టీలతో కలిసి 293 స్థానాలకే పరిమితమైంది. దీంతో మిత్రపక్షాల సహాయంతో కేంద్రంలో మోదీ సర్కార్‌‌‌‌ మూడోసారి అధికారంలోకి వచ్చింది.