బీఆర్‌‌ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్​ ముఖ్య లీడర్లపై ఫోకస్​

బీఆర్‌‌ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్..  కాంగ్రెస్​ ముఖ్య లీడర్లపై ఫోకస్​

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్​ హైకమాండ్ ​ఆపరేషన్​ ఆకర్ష్‌‌కు తెరలేపింది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత జోష్‌‌ మీదున్న ఉన్న కాంగ్రెస్‌‌కు గట్టి షాక్ ఇచ్చింది. పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రధాన అనుచరుడైన యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ ​కుమార్​రెడ్డి తన పదవికి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకోవడంతో పార్టీలో కలకలం రేగింది.  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కాంగ్రెస్‌‌లో చేరికలు అవసరం లేదని, 12 సీట్లు రిజర్వు అయ్యాయని కామెంట్​చేసిన కొద్దిరోజులకే అనిల్​రెడ్డి పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారే ముందు కూడా కార్యకర్తల మీటింగ్‌‌ పెట్టి కోమటిరెడ్డి కారణంగానే రాజీనామా చేస్తున్నానని, ఆయన మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించడం గమనార్హం.

అలక వీడని ఉత్తమ్ 

ఇంకోవైపు ఎంపీ ఉత్తమ్ ​కొంత కాలంగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ లీడర్లు, సన్నిహితులతో ఫోన్‌‌లో మాత్రం టచ్‌‌లో ఉంటున్నారు.  ప్రస్తుతం పార్లమెంట్​సమావేశాలు ఉండటంతోనే ఆయన రావడం లేదని అనుచరులు చెబుతున్నా.. కారణం అది కాదని తెలుస్తోంది.  ఉత్తమ్​పార్టీ మారుతారని పార్టీలోని ఓ వర్గం పనికట్టుకుని సోషల్​మీడియాలో ప్రచారం చేస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉత్తమ్ ​నియోజకవర్గంలో అడుగుపెట్టడం మానేశారని కొందరు నేతలు చెబుతున్నారు.  ఉత్తమ్ సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి మాత్రం కోదాడ, హుజూర్​నగర్​లో పర్యటిస్తున్నారు. పార్టీ అగ్రనేత​లు అందరూ ఏకతాటి పైకొచ్చారని, వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు గెలిచి తీరుతామని ప్రకటించిన ఇద్దరు ఎంపీల వైఖరి ప్రస్తుతం పూర్తి భిన్నంగా ఉండటంతో కాంగ్రెస్​లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. 

అనిల్​చేరికపై ఎప్పటి నుంచో ప్రచారం...

బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరాలనే ఆలోచన అనిల్ రెడ్డికి ఎప్పటి నుంచో ఉంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చింది.  అప్పట్లో ఎంపీ ఉత్తమ్‌‌తో చర్చించిన తర్వాత అనిల్ తన మనసు మార్చుకున్నారు. కానీ, ఎంపీ వెంకటరెడ్డి భువనగిరి, ఇబ్రహీంపట్నం, జనగాం, ఆలేరు నియోజకవర్గాల్లో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపణలు చేయడం సంచలనం రేకెత్తించింది.  వచ్చే ఎన్నికల్లో భువనగిరి సీటు బీసీలకు ఇస్తారనే ప్రచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ రెడ్డి పార్టీ  మారాలనే నిర్ణయానికి వచ్చారు.  భువనగిరి సీటు ‘గౌడ’ సామాజిక వర్గానికి ఇస్తారని ఓవైపు, ఒకవేళ అనిల్ రెడ్డి పార్టీ మారితే ఆయన ప్లేస్‌‌లో బీజేపీ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని చేర్చుకుంటారని ఇంకోవైపు జోరుగా  ప్రచారం జరుగుతోంది. అయితే అనిల్ రెడ్డి పార్టీ మారే విషయంలో జిల్లా మంత్రి జగదీశ్‌‌ రెడ్డి చొరవ చూపించారు. కాకపోతే పార్టీ మార్పు గురించి భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డికి సమాచారం లేదని చెబుతున్నారు.   పైగా అనిల్ రెడ్డి పార్టీ మారితే భువనగిరి, ఆలేరులో బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ప్రయోజనం చేకూరుతుందనే ఎత్తుగడ కూడా ఉంది.  చేరికలో భాగంగా అనిల్ రెడ్డికి ఎమ్మెల్సీ హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది.

ముఖ్యనేతలపైన బీఆర్‌‌‌‌ఎస్‌‌ కన్ను..

ఎంపీ ఉత్తమ్ అలక.. .ఆయన అనుచుడు అనిల్​ రెడ్డి పార్టీ మార్పుతో కాంగ్రెస్​లో అలజడి మొదలైంది. దీన్నే అదనుగా భావించిన బీఆర్ఎస్​ హైకమాండ్​ కాంగ్రెస్​ ముఖ్యనేతలపై కన్నేసింది. ముఖ్యంగా వెంకటరెడ్డిని వ్యతిరేకించే వర్గాన్ని బీఆర్​ఎస్​లో చేర్పించుకోవాలని పక్కా ప్లాన్​ వేసింది. ఇందులో భాగంగానే మునుగోడు, నకిరేకల్​, ఆలేరు, తుంగతుర్తి నియోజ కవర్గ నేతలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య గొడవలు ముదిరిపాకాన పడ్డాయి. వీటికి ఎంపీ వెంకటరెడ్డి ప్రధాన కారణమని అనిల్​రెడ్డి ఆరోపించారు. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ నేతలు ఎవరు కారెక్కుతారో పార్టీ నాయకత్వానికి అంతుచిక్కడం లేదు.