
న్యూఢిల్లీ: దేశంలో ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ క్యాంపెయిన్ షురూ చేసింది. దీనిపై ప్రతి ఒక్కరూ గళమెత్తాలని పిలుపునిచ్చింది. బీజేపీ కబంధ హస్తాల నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరింది. దొంగ ఓట్లు ఎలా వేస్తారనే దానిపై రూపొందించిన వీడియోను కాంగ్రెస్ బుధవారం విడుదల చేసింది. ఇద్దరు భార్యాభర్తలు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లోకి వెళ్తుంటే.. ఇద్దరు వ్యక్తులు వస్తారు.
‘మీ ఓట్లు పోలైనయ్.. వెళ్లిపోండి’ అని చెప్తారు అయినా పోలింగ్ అధికారి మౌనంగా ఉన్నట్టుగా వీడియోలో చూపించారు. నిమిషం పాటు ఉన్న ఈ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మన ఓటు చోరీకి గురవుతున్నదంటే.. మనం అధికారం, గుర్తింపును కోల్పోయినట్టే’ అని ఆయన పేర్కొన్నారు.
ఇదే వీడియోను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే షేర్ చేసి.. ‘‘మీ ఓటు హక్కును లాక్కోనివ్వకండి. దీనిపై ప్రశ్నించండి.. సమాధానం కోసం డిమాండ్ చేయండి” అని పిలుపునిచ్చారు. ప్రియాంక గాంధీ కూడా వీడియోను షేర్ చేసి.. ‘‘ఓటును దొంగిలిస్తున్నారంటే.. మీ హక్కులను, ఐడెంటిటినీ దొంగిలిస్తున్నట్టే. ఓటు హక్కును కాపాడుకోండి.. ఓట్ల దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తండి” అని పిలుపునిచ్చారు.
ఆ ఏడుగురితో చాయ్ తాగిన రాహుల్
బిహార్‌లో ఏడుగురు ఓటర్లు చనిపోయారంటూ ఓటర్ లిస్ట్ నుంచి వారి పేర్లను ఈసీ తొలగించిందని.. కానీ వారంతా బతికే ఉన్నారని రాహుల్ గాంధీ చెప్పారు. బుధవారం తనను కలిసిన ఆ ఏడుగురితో కలిసి చాయ్ తాగానని, ‘డెడ్ ఓటర్ల’తో చాయ్ తాగే అరుదైన అనుభవాన్ని కల్పించిన ఈసీకి ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. వారితో ఇంటరాక్ట్ అయిన వీడియో క్లిప్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశారు. కాగా, తామంతా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నియోజకవర్గానికి చెందిన ఓటర్లమని, బతికే ఉన్నామని చెప్పేందుకే వచ్చామని వారు చెప్పారు.
అతడి నుంచి నాకు ప్రాణహాని ఉంది..
పరువు నష్టం కేసులో ఫిర్యాదుదారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని బుధవారం ఫుణె కోర్టుకు తెలిపారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో 2022, నవంబర్ 17న భారత్ జోడో యాత్ర సందర్భంగా వీడీ సావర్కర్ ను బ్రిటీష్ సర్వెంట్ అని విమర్శించారు. దీంతో రాహుల్ పై పరువు నష్టం కేసు నమోదైంది.
ఈ కేసులో రాహుల్ తరపున న్యాయవాది మిలింద్ పవార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల తాను లేవనెత్తిన రాజకీయ సమస్యలు, గతంలో సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలతో తన భద్రతపై భయాలు ఉన్నాయన్నారు. ఫిర్యాదుదారుడైన సాత్యకి సావర్కర్.. మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ప్రత్యక్ష వారసుడని తెలిపారు. ఫిర్యాదుదారుడి వంశానికి హింస, రాజ్యాంగ వ్యతిరేక ధోరణుల చరిత్ర ఉందని పేర్కొన్నారు.