హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

కరీంనగర్ జిల్లా  హుజురాబాద్ లో జరిగే  ఉప ఎన్నికల్లో  ఇప్పటి వరకు  బీజేపీ మినహా.. ప్రధాన పార్టీలైన  టీఆర్ఎస్,  కాంగ్రెస్ ఇప్పటి వరకు  తమ అభ్యర్థులెవరో  ప్రకటించలేదు. టీఆర్ఎస్  అభ్యర్థి  ఎంపికపై  కసరత్తు  చేస్తుండగా... కాంగ్రెస్  ఇంకా ఏ ప్రయత్నం చేయడం లేదు.  పీసీసీ అధ్యక్షునిగా  రేవంత్ రెడ్డి  నియామకంతో  మొన్నటివరకు కాంగ్రెస్  తరపున  పోటీ చేస్తారనుకున్న  పాడి కౌశిక్ రెడ్డి  అభ్యర్థిత్వంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  టికెట్ ఇవ్వాలంటూ  కొత్త నేతలు  ముందుకొస్తున్నారు.

 ఈటలకు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డే మళ్లీ పోటీ చేస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఆయన కొద్ది రోజుల క్రితం కమలాపూర్ మండలంలో ప్రచారం కూడా ప్రారంభించారు. ఇంతలోనే పీసీసీలో మార్పు జరగడంతో కొత్త సారథిగా రేవంత్ రెడ్డి వచ్చారు. దీంతో కథ మొదటికొచ్చినట్లైంది. మొన్నటివరకు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చిన్నమ్మ కుమారుడైన కౌశిక్ రెడ్డికి ఇప్పుడు హుజురాబాద్ టికెట్ వస్తుందా? రాదా అన్నది చర్చనీయంశంగా మారింది. ఈటల రాజేందర్ పై అసైన్డ్ భూముల ఆరోపణలు వచ్చిన తర్వాత... కౌశిక్ రెడ్డి వరసగా ప్రెస్ మీట్లు పెడుతూ మాటలదాడికి దిగారు. ఈటలపై కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్ చూపించగా.. కౌశిక్ రెడ్డి  విమర్శలు చేస్తూ దూకుడుగా  వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ  కౌశిక్ రెడ్డి వెనక ఉండి విమర్శలు చేయిస్తోందని కాంగ్రెస్ నేతలు కొందరు  ఆరోపించారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరతారని మరికొందరు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు.

రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడయ్యాక కౌశిక్ రెడ్డి ఆయన్ను కలిసి హుజురాబాద్ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు  తెలుస్తోంది. హుజురాబాద్ కు చెందిన కిసాన్ సెల్ కరీంగనర్ జిల్లా శాఖ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొల్నేని సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డిని కలిసి హుజురాబాద్ నుంచి పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు.  గతంలో కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన వ్యక్తుల్లో పత్తి కృష్ణారెడ్డి ఉన్నారు. వీరిద్దరికి బదులు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను బీసీ కోటాలో ఈటలపై పోటీ పెడితే ఎలా ఉంటుందన్న చర్చ  కాంగ్రెస్ లో జరిగినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఇటీవల పొన్నంను కలిసినప్పుడు ఈ టాపిక్ వచ్చినట్లు సమాచారం. అయితే  పొన్నం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో.. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు గట్టిపోటీ ఇచ్చే వ్యక్తి కోసం ప్రయత్నిస్తోంది కాంగ్రెస్.