- 34 సీట్లు ఇవ్వాలన్న రాహుల్ గాంధీ
- 31 సెగ్మెంట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజ్వర్డ్
- పాతనగరంలో 8 సీట్లపై ఆశలు లేనట్లే
- 46 సీట్లలో మిగతా నేతలు అడ్జెస్టవుతారా?
- తెలంగాణ కాంగ్రెస్ లో అసెంబ్లీ టికెట్ల కాక
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని బీసీ టికెట్ల గండం వెంటాడుతోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతి లోక్ సభ స్థానంలో రెండు అసెంబ్లీ టికెట్లను బీసీలకు కేటాయించాలని సూచించారు. ఈ లెక్కన 34 సీట్లు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉంటుంది. 31 రిజర్వుడ్ సెగ్మెంట్లున్నాయి. వాటిలో ఎస్సీ 19, ఎస్టీ 12 నియోజకవర్గాలు. మొత్తం 65 సెగ్మెంట్లను పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాల్సి వస్తుంది. ఇవి పోను హైదరాబాద్ పాతనగరంలోని ఏడెనిమిది సెగ్మెంట్లలో ఎంఐఎం బలమైన శక్తిగా ఉంది. ప్రతి ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో మజ్లిస్ గెలుస్తూ వస్తోంది. ఇవి పోను మిగిలిన సెగ్మెంట్లు 46 మాత్రమే. పార్టీలోని బలమైన సామాజిక వర్గం ఈ 46 సీట్లలోనే తమ స్థానాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా..? అన్నది పార్టీలో కాకరేపుతున్నది. పలు సెగ్మెంట్లలో బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన లీడర్లు దొరకడం కష్టమన్న వాదన కూడా పార్టీ వర్గాల నుంచి వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందాలంటే అంగబలం, అర్థబలం అనేవి కూడా కీలకమనే వాదనను అదే పార్టీకి చెందిన కీలక నేత ఒకరు వినిపిస్తున్నారు. నిన్ననే అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమానికి టీపీసీసీ శ్రీకారం చుట్టింది. అందులో బీసీలకు రూ. 25 వేలు దరఖాస్తు ఫీజుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల వద్ద ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు. ఈ నె 25 వరకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా ప్రకటించింది. ఇందులో బీసీల నుంచి ఎన్ని దరఖాస్తులు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
కింకర్తవ్యం
రాహుల్ గాంధీ చెప్పినట్లుగా బీసీలకు 34 సీట్లు కేటాయిస్తే తమ సీట్లు గల్లంతవుతాయని భావిస్తున్న నేతలు కొందరు సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించాలనే వాదనను తెరమీదకు తెచ్చారు. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీ నాయకత్వం ఎదగలేదు. అక్కడ బీసీ ఫ్యాక్టర్ తో టికెట్లు కేటాయిస్తే ఓటమి ఖాయమనే వాదనను ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు తెరపైకి తెస్తున్నారు. మరో వైపు బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ తదితరులు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అందరిదనే వాదనను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ ఆదేశాలు పాటించడంతోపాటు బీసీ నేతలు నిర్వహిస్తున్న మీటింగ్ లకు బలం చేకూర్చేలా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. బీసీ సీట్ల విషయంలో నిర్ణయం తీసుకోవడం పీసీసీకి కత్తిమీద సాములా మారింది.
