సినిమా డైలాగులేనా.. పార్లమెంట్‎లో చర్చించరా..? ప్రధాని మోడీని నిలదీసిన కాంగ్రెస్

సినిమా డైలాగులేనా.. పార్లమెంట్‎లో చర్చించరా..? ప్రధాని మోడీని నిలదీసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: పాకిస్తాన్‎ను మోకాళ్లపై కూర్చోబెట్టినట్లు సభల్లో ప్రధాని మోదీ చెప్తున్నారని.. అదే అంశంపై చర్చించేందుకు పార్లమెంట్​సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కాంగ్రెస్​ పార్టీ ప్రశ్నించింది. సినిమా డైలాగులు చెప్తే సరిపోదని, వెంటనే పార్లమెంట్‎లో చర్చ పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్​ చేసింది. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్​ ఎక్స్‎లో ట్వీట్​ చేశారు. పీటీఐతో కూడా మాట్లాడారు. రాజస్తాన్‎లోని బికనీర్​ సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. భారత్​, పాకిస్తాన్​ మధ్య సీజ్​ఫైర్‏కు తాము మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్​ వ్యాఖ్యలపై మోదీని నిలదీశారు. 

పహల్గాం దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, వారిని ఎప్పుడు పట్టుకుంటారని జైరాం ప్రశ్నించారు. ఇప్పటికైనా పార్లమెంట్​ప్రత్యేక సమావేశాలు పెట్టి.. దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. కాంగ్రెస్​ఎంపీ ప్రణితి షిండే మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్​సిందూర్​తర్వాత ప్రధాని మోదీ దృష్టంతా పబ్లిసిటీ, సొంత భజనపై ఉంది. దేశ ప్రజలకు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడం లేదు. పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి కారణమైన టెర్రరిస్టులను ఎందుకు అరెస్ట్​ చేయడం లేదు” అని ప్రశ్నించారు.