
- ఆయనకు బాధ్యతలపై హైకమాండ్‌దే నిర్ణయం
- కాంగ్రెస్‌లో చేరాక వేరే పార్టీలకు పన్జేస్తమంటే కుదరదు
- ఓడిపోయే టీఆర్ఎస్తో మాకు పొత్తుండదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌కు స్ట్రాటజిస్టుల అవసరం లేదని, తమ పార్టీలో నాయకులు తప్ప స్ట్రాటజిస్టులు ఉండరని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతడని, ఆయనకు ఏ బాధ్యతలు అప్పగించేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని రేవంత్ అన్నారు. పీకేను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేదే స్ట్రాటజిస్టు సునీల్ అనుకోవచ్చన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే టీఆర్ఎస్ తో తమకు పొత్తు ఉండదని రేవంత్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని, మే 6న రాష్ట్ర ప్రజలకు మరింత స్పష్టత వస్తుందని రేవంత్ అన్నారు. శనివారం గాంధీ భవన్లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు రేవంత్ అధ్యక్షతను పీసీసీ విసృత స్థాయి సమావేశం జరిగింది.
ప్రతి కార్యకర్తా సభకు రావాలె
వచ్చే నెల 6,7 తేదీల్లో రాహుల్ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. పార్టీ డిజిటల్ మెంబర్‌షిప్‌లో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, రైతు సంఘర్షణ సభను సక్సెస్ చేయడానికి అందరూ కృషి చేయాలని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా రాహుల్ సభకు రావాలని ఆయన కోరారు. వచ్చే నెల 7న ఉస్మానియా వర్సిటీకి రాహుల్ వచ్చేలా కృషి చేద్దామన్నారు. 25న కరీంనగర్, 26న ఖమ్మం, 27న నల్గొండ జిల్లాల్లో పార్టీ ముఖ్యనాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని రేవంత్ చెప్పారు. ఈ 3 జిల్లాల్లోని 7 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి ఎక్కువ జన సమీకరణ చేయాలని సూచించారు. కాగా, రాహుల్ మీటింగ్ కోసం పీసీసీ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. సమావేశంలో పీసీసీ కార్యవర్గం, పీఏసీ, డీసీసీ, పార్టీ అనుబంధ సంఘాలు, అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ల కో ఆర్డినేటర్లు, నేతలు పాల్గొన్నారు.
సీబీఐ విచారణ జరిపించండి
రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైకి రేవంత్ లేఖ రాశారు. ఇందులో మంత్రుల ప్రమేయం ఉన్నందున సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులకు చెందిన కాలేజీలే బ్లాక్ దందా నిర్వహిస్తుంటే.. పోలీసుల విచారణతో న్యాయం జరుగుతుందని ఆశించలేమని చెప్పారు. నీట్ ర్యాంక్ ఆధారంగా జరిగే కౌన్సెలింగ్ లో లొసుగులను ఆసరాగా చేసుకుని ఏటా రూ.100 కోట్ల మేర సీట్ల బ్లాక్ దందా జరుగుతోందని చెప్పారు. కన్వీనర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద, మధ్య తరగతి విద్యార్థులతో భర్తీ కావాల్సిన సీట్లను వ్యూహాత్మకంగా మేనేజ్ మెంట్ కోటా కిందకు మార్చుకుని కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.