- పార్టీ మార్పు దిశగా 12 మంది కౌన్సిలర్లు
- కాంగ్రెస్ మంత్రులతో సమాలోచనలు
సిద్దిపేట, వెలుగు: రెండు దశాబ్దాలుగా సిద్దిపేట బల్దియాపై పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇరవై ఏండ్లుగా సిద్దిపేట మున్సిపాల్టీ పై గులాబీ జెండా ఎగురుతుండగా పాగా వేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో కనీసం బోణీ కొట్టలేకపోయింది. ఇతర పార్టీల నుంచి కౌన్సిలర్లుగా గెలిచిన వారు సైతం తర్వాత బీఆర్ఎస్ లో చేరిపోవడంతో సిద్దిపేట మున్సిపాల్టీలో ప్రతిపక్షం అనేది లేకుండాపోయింది.
గడిచిన సిద్దిపేట మున్సిపాల్టీ ఎన్నికల్లో మొత్తం 43 సీట్లలో 36 బీఆర్ఎస్, ఐదు ఇండిపెండెంట్లు (బీఆర్ఎస్ రెబల్స్) బీజేపీ ఒకటి, ఎంఐఎం ఒకటి గెలిచారు. దాదాపు అన్ని సీట్లలో పోటీచేసిన కాంగ్రెస్ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ కు చెందిన బలమైన అభ్యర్థులను సైతం బీఆర్ఎస్ లో చేర్చుకుని వారికి టికెట్లిచ్చి గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ముఖ్య నేతల వ్యూహ రచనలో భాగంగానే ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరగా మరో 12 మంది చేరడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మూడు నెలలుగా అసంతృప్తి సెగలు
బీఆర్ఎస్ కౌన్సిలర్లలో మూడు నెలలుగా ఉన్న అసంతృప్తి సెగలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కౌన్సిలర్లకు ఎలాంటి అసంతృప్తి లేకున్నా చైర్ పర్సన్ భర్త వైఖరితోనే మెజార్టీ సభ్యులు విభేదిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజుల్లో అసంతృప్తి ఉన్నా అది బయటపడకుండా జాగ్రత్త వహించిన కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన పక్షం రోజుల్లోనే పది మంది కౌన్సిలర్లు రహస్యంగా సమావేశమయ్యారు.
సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ భర్త వైఖరిని నిరసిస్తూ అవిశ్వాస నోటీసును ఇవ్వాలని నిర్ణయించగా మరికొందరు కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమయ్యారు. పరిస్థితి చేజారి పోతోందన్న భయంతో కౌన్సిలర్ల ను బుజ్జగించడమే కాకుండా ఇటీవల చైర్ పర్సన్ వర్గానికి చెందిన 20 మందిని ప్రత్యేకంగా గోవా టూర్ కు తీసుకెళ్లారు. చైర్ పర్సన్ భర్త వైఖరిపట్ల అసంతృప్తితో ఉన్న వారెవరూ గోవా టూర్ కు వెళ్లలేదు.
అందులో ముగ్గురు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రె కండువా కప్పుకున్నారు. అదే బాటలో మరో 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఐదురుగురు కౌన్సిలర్లు కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. వచ్చే కొద్ది రోజుల్లో మరో అరడజను మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో చేరిన తర్వాత చైర్ పర్సన్ పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ నోటీసు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ట్రబుల్ షూటర్ టార్గెట్ గా
ట్రబుల్ షూటర్ గా పేరున్న మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును రాజకీయంగా బలహీన పరచాలనే దిశగా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లను కాంగ్రెస్ లో చేర్చుకుని బీఆర్ఎస్ ను మానసికంగా దెబ్బకొట్టాలని ఎత్తులు వేస్తున్నారు. సిద్దిపేట కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నా హరీశ్‌రావు పెద్దగా స్పందించకపోవడం ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో తనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసేవారిని తనవైపు తిప్పుకునేవారు కానీ ప్రస్తుతం కౌన్సిలర్లు పార్టీ మారుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.