అగ్రి చట్టాలపై కాంగ్రెస్​ రెండు నాలుకల ధోరణి

అగ్రి చట్టాలపై కాంగ్రెస్​ రెండు నాలుకల ధోరణి

రిఫామ్స్ వచ్చిన ప్రతిసారీ మొదట్లో ప్రభుత్వాలు వ్యతిరేకతనే చూశాయి. తర్వాత ఆ సంస్కరణలే దేశ ఆర్థిక అభివృద్ధికి సాయపడ్డాయి. ఇప్పుడు వ్యవసాయం సంస్కరణలను అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం ధైర్యంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం తెచ్చిన చట్టాల్లో లోపాలుంటే మార్పులు సూచించడంలో తప్పులేదు. కానీ గతంలో యూపీఏ తాము అధికారంలో ఉండగా వ్యవసాయం రంగంలో సంస్కరణలతో కాంట్రాక్టు సాగు లాంటి విధానాలను తేవాలని ప్రయత్నించి.. ఇప్పుడు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉంది. తాము అధికారంలో లేనప్పుడు ప్రజలకు మంచి జరగొద్దు అన్నట్టుగా ఉంది ప్రతిపక్షాల తీరు. ‘మేం అమలు చేయలేకపోయిన విధానాలను ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినప్పడు తెరపైకి తెస్తే వ్యతిరేకిస్తాం’ అంటే అది అవకాశవాద రాజకీయానికి పరాకాష్ట కాదా? అన్నది ఆలోచించాలి.

ప్రపంచ వ్యాప్తంగా సంస్కరణ పథంలో పయనించి సత్వరం వాటిని అమలుపరిచిన దేశాలు ఆర్థిక వృద్ధి పథంలో వేగంగా పురోగమించాయి. ప్రస్తుత కరోనా క్రైసిస్ లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలి కనీవినీ ఎరుగని ప్రతికూల పవనాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత మెరుగైన ఆర్థిక భవిష్యత్తు, సుసంపన్నత కోసం ప్రతీ దేశం విభిన్న రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టడం తప్పనిసరి అయింది. ప్రపంచం విస్తృతంగా ఆమోదించిన ఈ ఆర్థిక సిద్ధాంతానికి లోబడే మోడీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలు తాకట్టు పెట్టకుండానే వ్యవసాయ సంస్కరణలతో పాటు వివిధ రిఫామ్స్ చేపట్టింది. ఇప్పటి వరకు చేసిన సాహసోపేత నిర్ణయాలన్నీ నెమ్మదిగా సత్ఫలితాలను ఇస్తుండడంతో ప్రస్తుతం ఎన్డీయే తీసుకుంటున్న నిర్ణయాలను కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకప్పుడు వ్యవసాయ రంగ సంస్కరణలకు అనుకూలంగా ఓటు వేసిన పార్టీలు, నాయకులు ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నాయి. రైతు ఉద్యమం మాటున మోడీకి వ్యతిరేకంగా ఆ పార్టీలు ఒక్కటయ్యే పనిలో పడ్డాయి. వ్యవసాయ చట్టాలపై రేయింబవళ్లు ముమ్మరంగా తప్పుడు ప్రచారం చేస్తూ రైతులకు జరిగే మేలు తెలియనీయకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలు రైతులకు మంచి జరగకుండా అడ్డుకునైనా తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయి.

ఇదే తరహాలో నాడు వ్యవసాయ సంస్కరణలు

కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు చేస్తున్నది పచ్చి అవకాశవాద రాజకీయాలన్న విషయం గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే అర్థమైపోతుంది. ప్రస్తుతం చట్టం రూపంలో మోడీ ప్రభుత్వం తెచ్చి అమలుకు సిద్ధమైన తరహా సంస్కరణలనే కాంగ్రెస్ సర్కారు పలుమార్లు ప్రస్తావించింది. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో (2004-–2014) వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏపీఎంసీ చట్టం ఆధారంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలకు నాందిపలికింది. 2007లో కొన్ని నిబంధనలు రూపొందించి వాటిని అమలుపరచాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. వివిధ పార్టీల (కాంగ్రెస్, బీజేపీ, ఇరత పార్టీలు) పాలనలోని ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు 2005–11 మధ్య కాలంలో మోడల్ ఏపీఎంసీ చట్టం–2003ని అమలుచేశాయి.

2006లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎం.ఎస్.స్వామినాథన్ సారథ్యంలోని జాతీయ వ్యవసాయ కమిషన్ ఏకీకృత జాతీయ మార్కెట్ ను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది. అప్పటి వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 2010 మార్చిలో హర్షవర్ధన్ పాటిల్  చైర్మన్ గా, 10 రాష్ర్టాల మంత్రులు సభ్యులుగా సాధికార వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు.  సమాంతరంగా శరద్ పవార్ 2010 ఆగస్టులో అన్ని రాష్ర్టాల సీఎంలకు లేఖ రాస్తూ ‘వ్యవసాయదారులు/ ఉత్పత్తిదారులు, వినియోగదారుల విస్తృత ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ మార్కెటింగ్ చానళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలి’ అని సూచించారు.

2012 సంవత్సరం మే నెలలో రాజ్యసభలో వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలపై మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సరళతరం చేయాలని నిర్ణయించామని శరద్​ పవార్​ చెప్పారు. ఏపీఎంసీ  చట్టాల్లో సవరణలు చేయాలని రాష్ర్టాల సహకార శాఖల మంత్రులను కూడా కోరామన్నారు. 2010 సంవత్సరంలో ఏర్పాటు చేసిన పాటిల్ కమిటీ కూడా 2013లో నివేదిక సమర్పించింది. కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన విధానాలు సరళం చేయాలని, పంటల అనంతర మౌలిక వసతుల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని, ఎలాంటి అడ్డుగోడలు లేని జాతీయ మార్కెట్లు ఏర్పాటు చేయాలని, పళ్లు, కూరగాయలపై మార్కెట్ ఫీజు రద్దు చేయాలని  ఆ నివేదికలో సిఫారసు చేసింది.

కాంగ్రెస్ చేయలేక అగిపోయి..

దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలుపరిచింది తామేనంటూ ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీయే ఈ రోజు వ్యవసాయ సంస్కరణలకు మోకాలడ్డుతోంది. తాము అమలు చేయాలనుకుని, ప్రభుత్వం మారడంతో వీలుకాక ఆగిపోయిన తరహాలోనే ఉన్న పలు సంస్కరణలను మోడీ సర్కారు ధైర్యంగా చట్టం చేయడంతో క్రెడిట్ ఎన్డీయేకు వస్తుందన్న భయం కాంగ్రెస్ లో కనిపిస్తోంది. ఇప్పటికే వీక్ అయిపోయిన కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు చేస్తూ, తన మిత్రపక్షాలను రెచ్చగొడుతోంది. రైతులకు మంచి జరిగితే బీజేపీ మరింత బలపడుతుందని నూరిపోస్తోంది. రైతులకు వాస్తవాలు తెలియకుండా చేయాలని కంకణం కట్టుకుంది.

ఆ భయంతోనే..

పళ్లు, కూరగాయలను ఏపీఎంసీ చట్టం పరిధి నుంచి తప్పిస్తామని, రైతులకు “స్వేచ్ఛ” కల్పిస్తామని 2012, 2013 మధ్య కాలంలో కాంగ్రెస్ పదే పదే ప్రకటించింది. కానీ అందుకు అవసరం అయిన రాజకీయ చిత్తశుద్ధి గాని, సాహసం గాని ఎన్నడూ ప్రదర్శించలేదు. పార్లమెంటు ఆమోదించిన మూడు సంస్కరణ చట్టాలే విజయవంతంగా అమలుపరిచినట్టయితే రైతులతో తమకు గల బంధం కూడా తెగిపోతుందని ఆ పార్టీ భయపడుతోంది. అయితే ఈ విషయాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లి,  ప్రస్తుత చట్టాలతో రైతులకు కలిగే ప్రయోజనాలను సవివరంగా చెప్పడం ద్వారా రైతుల ఉద్యమాన్ని అవకాశవాద రాజకీయ పార్టీలు వాడుకోకుండా చూడాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ సత్యనారాయణ, చెన్నై