ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళలకు మొండిచేయి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  మహిళలకు మొండిచేయి
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కేటాయించిన తొమ్మిది స్థానాల్లో దక్కని చోటు
  •  పార్టీకి రాజీనామా చేసిన సరస్వతి, తీవ్ర అసంతృప్తితో సుజాత
  •  చెన్నూర్ స్థానంలోనూ మహిళకు టికెట్ అనుమానమే..

ఆసిఫాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. కేటాయించిన తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లోనూ పురుషులకే ఛాన్స్​ఇచ్చింది. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్​లో ప్రవేశపెట్టి, వచ్చే ఎన్నికల నుంచి అమలు చేస్తామని ప్రకటించగా.. ఈ  బిల్లును వెంటనే అమల్లోకి తేవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ ఆదిలాబాద్​ ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలుండగా ప్రకటించిన తొమ్మిదింట్లో ఒక్క మహిళకు కూడా టికెట్ ఇవ్వలేదు.

బీజేపీ ప్రకటించిన సీట్లలో ఎస్సీ నియోజకవర్గమైన బెల్లంపల్లి స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవికి కేటాయించగా, ఎస్టీ నియోజకవర్గమైన ఆసిఫాబాద్ స్థానాన్ని జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మిని బీఆర్ఎస్ బరిలో దించింది. ప్రధాన పార్టీలు కనీసం ఒక్క మహిళకైనా టికెట్ ఇవ్వగా కాంగ్రెస్ మాత్రం వారికి మొండిచేయి చూపించింది. సిర్పూర్​లో రావి శ్రీనివాస్, ఆసిఫాబాద్​లో అజ్మీర శ్యామ్ నాయక్, ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస్, బోథ్​ నుంచి డాక్టర్ వెన్నెల అశోక్, ఖానాపూర్ వెడ్మ బోజ్జు పటేల్, ముథోల్​లో నారాయణ రావు పటేల్, బెల్లంపల్లి గడ్డం వినోద్, మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, నిర్మల్ శ్రీహరి రావుకు కేటాయించగా.. టికెట్​ఆశించిన మహిళలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. 

భంగపడ్డ సుజాత, సరస్వతి

పార్టీ కోసం కష్టపడి, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చిన మహిళలకు ఆ పార్టీ మొండిచేయి చూపింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉంటూ అక్కడ క్యాడర్​ను కూడగట్టుకున్న సీనియర్ లీడర్ గండ్రత్ సుజాత ఈసారి పార్టీ టికెట్​ను ఆశించారు. ఇందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ చివరికి కొత్తగా పార్టీలో చేరిన కంది శ్రీనివాస్​ రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించింది.

పార్టీ నిర్ణయంతో సుజాత తీవ్ర నిరాశలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గం పేర్కొంటోంది. ఇక ఎస్టీ నియోజకవర్గమైన ఆసిఫాబాద్ నుంచి దివంగత మాజీ గిరిజన శాఖ మంత్రి కోట్నాక్ భీంరావు కూతురు మర్సుకోల సరస్వతి తనకే టికెట్ వస్తుందని నియోజకవర్గంలోని ఊరూరా తిరుగుతూ స్తూ ప్రచారం చేసుకున్నారు. ఆదివాసీ జిల్లాలో ఆదివాసీ మహిళకే టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

కానీ ఇటీవలే కాంగ్రెస్​లో చేరిన అజ్మీర శ్యామ్ నాయక్​కు అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. దీంతో శ్యామ్ నాయక్​కు టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర పార్టీ చీఫ్ ​రేవంత్ ​రెడ్డి ఆసిఫాబాద్​టికెట్​ను అమ్ముకున్నాడని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివాసులతో కలిసి నిరసన తెలుపుతూ ర్యాలీలు చేపట్టారు. తన పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి రాజీనామా చేశారు. 

రామిళ్ల రాధికకు దక్కేనా..?

బీఆర్​ఎస్​ టికెట్​ ఇవ్వకపోవడంతో చివరి క్షణంలో కాంగ్రెస్​లో చేరిన ఖానాపూర్​ఎమ్మెల్యే రేఖా నాయక్​కు టికెట్ ​ఆశించారు. ఆమెకు సైతం పార్టీ టికెట్​ కేటాయించలేదు. ఎస్సీ నియోజకవర్గమైన చెన్నూర్ స్థానాన్ని ఇంకా ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, రామిళ్ల రాధిక, రాజా రమేశ్, నూకల రమేశ్​ టికెట్ ఆశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్​ ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించనున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. సీపీఐకి కేటాయిస్తే పోటీలో నిలిచిన మహిళా నేత రామిళ్ల రాధికకు కూడా టికెట్ ​దక్కనట్లే..