
చైనా ‘రిసెప్’ ఒప్పందంతో మన ఆర్థిక వ్యవస్థకు నష్టం
దేశాన్ని మోడీ ‘సేల్ ఇన్ ఇండియా’గా మారుస్తున్నరు
ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ధ్వజం
హైదరాబాద్, వెలుగు: చైనాతో వస్తువుల ఉచిత ఎగుమతి, దిగుమతుల కోసం చేసుకోబోతున్న ‘రిసెప్ ( రీజనరల్ కాంప్రహెన్సివ్ ఎకానమిక్ పార్టనర్ షిప్)’ ఒప్పందంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో పడుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతో దేశం డంపింగ్ యార్డుగా మారుతుందన్నారు. మేకిన్ ఇండియా.. సేల్ ఇన్ ఇండియాగా మారుతుందని మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. నవంబరు 4న చైనాతో చేసుకోబోతున్న రిసెప్ తో ఇండియాకు కలిగే ప్రయోజనాలేమిటో ప్రధాని మోడీ దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ విధానాలను విపక్షాలతో సహా ఆర్‌ఎస్‌ఎస్ కూడా తప్పు పడుతోందన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అవగాహన లేని నిర్ణయాలతో ఎన్డీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలో పడేసిందన్నారు.