మా పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది: మల్లికార్జున ఖర్గే

మా పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది: మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశానికి స్థిరమైన, జాతీయవాద ప్రభుత్వాన్ని అందిస్తామని తెలిపారు. గురువారం ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్​లో ఖర్గే మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో 421 సార్లు మతపర, విభజనవాద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కుల, మతాల ఆధారంగా ఓట్లు అభ్యర్థించకూడదని ఎలక్షన్ కమిషన్(ఈసీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ మోదీ వాటిని ఉల్లంఘించారని విమర్శించారు. గత 15 రోజుల్లో మోదీ తన ప్రసంగాల్లో 232 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారని పేర్కొన్నారు.

758 సార్లు తన పేరును మోదీ తలుచుకున్నారని వివరించారు. ఒక్కసారి కూడా నిరుద్యోగం గురించి మాట్లాడలేదని ఆరోపించారు. గాంధీపై రిచర్డ్ అటెన్ బరో సినిమా తీసే వరకు ప్రపంచానికి పెద్దగా తెలియదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఖర్గే కొట్టిపారేశారు. ‘‘ప్రధాని వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. గాంధీ గురించి ఆయనకు తెలియదేమో కానీ ప్రపంచానికి బాగా తెలుసు. యునైడెట్ నేషన్స్​తో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గాంధీ విగ్రహాలు ఉన్నాయి. జూన్ 4 తర్వాత  ఆయనకు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది. అప్పుడు గాంధీ ఆటోబయోగ్రఫీ చదివి, ఆయన గురించి తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నారు.