రాజన్నకు కేసీఆర్ శఠగోపం..కాంగ్రెస్ వినూత్న నిరసన

రాజన్నకు కేసీఆర్ శఠగోపం..కాంగ్రెస్ వినూత్న నిరసన

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రాజన్న గుడి మెట్లపై కొబ్బరి కాయలు పెట్టి నిరసన తెలిపారు. రాజన్న గుడి సాక్షిగా ముంపు గ్రామాల ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన  హామీ ఏమైందని నిలదీశారు. దేవుడిని కూడా మోసం చేశారంటూ మండిపడ్డారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఏటా 100 కోట్ల చొప్పున కేటాయిస్తానని చెప్పి 8 ఏళ్లు పూర్తయినా హామీలు నెరవేర్చలేదని  విమర్శించారు. 

సీఎం కేసీఆర్ హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యారని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలను మోసం చెయ్యడం కేసీఆర్ కు అలవాటే అని.... కానీ దేవుడికి కూడ కేసీఆర్ శఠగోపం పెట్టాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీలకు బాధ్యత లేదన్నారు. వేముల వాడ ప్రజలు ఆలోచించాలని సూచించారు. యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశారు కానీ ఇతర ఆలయాలను మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజన్న గుడిని అభివృద్ధి చేస్తామని పొన్నం హామీ ఇచ్చారు.