మోడీ పాలనలో వారికే లాభం

మోడీ పాలనలో వారికే లాభం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో కార్పొరేట్ శక్తులకు మాత్రమే లాభం జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ పాలనలో అదానీ, అంబానీలకు మాత్రమే లాభం కలుగుతోందని, దేశాన్ని విభజించి కొంతమందికే మేలు జరిగే విధంగా చేస్తున్నారని ఆయన  మండిపడ్డారు.  రైతులను పూర్తిగా కేంద్రం విస్మరించిందని, దేశంలో విద్వేష రాజకీయాలను  ప్రోత్సహిస్తోందన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం దేశానికి ప్రధాన సమస్యలుగా మారాయన్నారు. మీడియాను కూడా కార్పొరేట్ శక్తులు కబలించి వేస్తున్నాయని విమర్శించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మోడీ ప్రశ్నిస్తున్నారని.. యూపీఏ హయాంలో రైతులకు ఎంతో చేసిందని రాహుల్ గాంధీ వివరించారు. ఇంతటి స్థాయిలో ధరల మంటను.. యూపీఏ హయాంలో దేశం చూడనే లేదన్నారు.

రామ్ లీలా మైదాన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ మెహంగై పర్ హల్లా బోల్’ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. రైతులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల... ఇతరత్రా విషయాలపై పార్లమెంట్ లో ప్రతిపక్షాలు గళం విప్పాలని ప్రయత్నం చేసినా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకపోవడంతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. వారి దగ్గరకు వెళ్లి వాస్తవ విషయాలు చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ఈడీకి తాను భయపడనని, ఎన్ని గంటలైనా విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పుడు ప్రశ్నించకపోతే దేశం నాశనమౌతుందని అభిప్రాయపడ్డారు. 

దేశంలోని యావత్ మీడియా, టీవీ చానళ్లు, పత్రికలన్నీ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తల చేతిలోనే ఉన్నాయని రాహుల్ అన్నారు. ఇ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ప్రధాని మోడీ చేతిలో ఉన్నారని చెప్పారు. ఇటువంటప్పుడు మీడియాలో ప్రజా సమస్యలు, వాస్తవాలు ఎలా కనిపిస్తాయని ప్రశ్నించారు. మీడియా వాస్తవాలు చెప్పట్లేదు.. వాస్తవాలు చూపట్లేదు..  ఇలాంటప్పుడు ప్రజల్లోకి వెళ్లడం ఒక్కటే విపక్షాల ముందున్న ఏకైక మార్గమని రాహుల్ చెప్పారు. 

‘‘80 గంటలు కాదు.. 100 గంటలు కాదు.. 300, 500 గంటలైనా ఈడీ విచారణను ఎదుర్కోవడానికి నేను రెడీ. దాన్ని చూసి నేను భయపడను. ఒకవేళ మనం ఈ రోజు నిలబడకుంటే ఈ దేశం నిలబడదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.  యూపీఏ సర్కారు హయాంలో తెచ్చిన ఉపాధిహామీ పథకం గనుక ఇప్పుడు అమల్లో లేకుంటే.. దేశం నిప్పులగుండంగా మారిపోయి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.