
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం (జూన్ 1) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ను సమావేశపరిచి పాక్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చలు జరపాలన కోరారు. దేశమంతా సాయుధ దళాలకు అండగా నిలుస్తుందని.. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ఐక్యంగా ఉండాలన్నారు.
అన్ని పార్టీల రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని, సైనిక చర్యను రాజకీయం చేయవద్దని పేర్కొన్నారు. ప్రత్యర్థులను ఓడించడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు విదేశాలకు వెళ్లిన ప్రతినిధి బృందాల నివేదికలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ ఇకనైనా ఎన్నికల ప్రసంగాలు చేయడం మానుకోవాలని.. స్వీయ ప్రశంసలు అవసరం లేదని చురకలంటించారు.
దేశం మొత్తం మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. సాయుధ దళాలకు పూర్తి అధికారం ఇచ్చామని చెప్పిన మోడీ.. మళ్ళీ ఎందుకు ఆ అంశాలపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మోడీ స్వీయ -ప్రశంసల ప్రసంగాలు చేయకూడదని.. పార్లమెంటును సమావేశపరిచి మాట్లాడుకుందామని పేర్కొన్నారు. పాకిస్తాన్ కూడా తన పార్లమెంటును సమావేశపరిచి భారత్ తో నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తోందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ విషయంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని ఫైర్ అయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ తీసుకోవడంపై స్పష్టత ఇవ్వడానికి బదులు.. ప్రధానమంత్రి మోడీ సాయుధ దళాల పరాక్రమానికి వ్యక్తిగత క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు.