హిమాచల్ ఎన్నికలు : మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్

హిమాచల్ ఎన్నికలు : మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్

త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. లక్ష ఉద్యోగాలు, ఓపీఎస్ (పాత పెన్షన్‌ విధానం) అమలు, మహిళలకు నెలకు రూ.1500, 300 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ తో సహా 10 హామీలను ప్రజలకు వాగ్దానం చేసింది. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని, ప్రజల అంచనాలను అందుకోవడంలో ఆ పార్టీ విఫలమైందని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ధని రామ్ షాండిల్ అన్నారు. తాము రిలీజ్ చేసింది మేనిఫెస్టో మాత్రమే కాదని, హిమాచల్ ప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రూపొందించిన డాక్యుమెంట్ అని తెలిపారు 

68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8వ తేదీతో ముగియనుంది. మొత్తం ఈ ఎన్నికల్లో 413 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అందులో 92 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సొంత జిల్లా మండిలోని జోగిందర్ నగర్ స్థానంలో అత్యధికంగా 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

హిమాచల్‌  అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 43 మంది, కాంగ్రెస్‌కు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు, ఒక సీపీఎం ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఇక మొత్తం ఓటర్ల సంఖ్య 55,07,261. ఇందులో పురుషులు 27,80,208, మహిళలు 27,27,016 మంది ఉన్నారు. 1,86,681 మంది ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో 80 ఏండ్లకుపైగా వయసున్న ఓటర్లు 1,22,087 మంది, 100 ఏండ్లు దాటిన ఓటర్లు 1,184 మంది ఉండటం విశేషం.