కేసీఆర్​, కేటీఆర్​లను తరిమికొట్టాలె

కేసీఆర్​, కేటీఆర్​లను తరిమికొట్టాలె
  • వాళ్లు లేకుంటే స్వేచ్ఛగా ఉందన్న రేవంత్

హైదరాబాద్ : కేసీఆర్​, కేటీఆర్​లు రాష్ట్రంలో లేకపోవడంతో ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారని, ఇది ఎక్కువ కాలం ఉండాలంటే ఆ ఇద్దరిని తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టాలని పీసీసీ చీఫ్​ రేవంత్​ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులు పండించిన వడ్లను సర్కారు కొనకుండా మిల్లర్లతో కుమ్మక్కైందని, దీంతో గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. ఆ రైతు కుటుంబాలను పరామర్శించని సీఎం కేసీఆర్​.. పంజాబ్​లో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన వికారాబాద్​ జిల్లా కొడంగల్​ నియోజకవర్గంలోని తుంకిమెట్ల, అంగడి రాయిచూర్​, చంద్రకల్​ గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్​ జయశంకర్​ సార్​ పుట్టిన ఊరు అక్కంపేటకు వెళ్తే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి ఏపాటిదో తెలుస్తుందని అన్నారు. ఊరిని సీఎం కేసీఆర్​ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. అక్కడ కనీసం తాగేందుకు మిషన్​ భగీరథ నీళ్లు లేవని, దళితులకు ఇళ్లు ఇవ్వలేదని, యువతకు ఉపాధి కల్పించలేదని అన్నారు. కనీసం జయశంకర్​ సార్​ విగ్రహం కూడా పెట్టలేదని, స్మృతి వనం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 
 

ఓఆర్​ఆర్​ (ORR) అంటూ రైతుల నోటి కాడి కూడు లాక్కోవద్దు
వరంగల్​ ఔటర్​ రింగ్​ రోడ్డు కోసం పచ్చటి పంటలు పండే భూమిని సేకరించి చిన్న రైతుల నోటి కాడి కూడు లాక్కోవద్దని సీఎం కేసీఆర్​ను పీసీసీ చీఫ్​ రేవంత్​ కోరారు. వరంగల్​, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో ఉన్న 21,517 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని గుర్తు చేశారు. ఆదివారం ఆయన సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. ఎక్కువ మందికి రెండు మూడు ఎకరాల రైతులే ఉన్నారని, భూ సమీకరణ ద్వారా వాళ్లే నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.

భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ల్యాండ్​ పూలింగ్​ జీవోను రద్దు చేస్తున్నట్టు కింది స్థాయి నేతలే చెప్తున్నారని, జీవోను రద్దు చేసినట్టు సీఎం హోదాలో కేసీఆర్​ ప్రకటన చేయాలని డిమాండ్​ చేశారు. జయశంకర్​ సార్​ గ్రామం అక్కంపేట అధ్వానంగా ఉందని, అభివృద్ధి చేయలేదని లేఖలో పేర్కొన్నారు. కనీసం రెవెన్యూ గ్రామంగానూ గుర్తించట్లేదన్నారు. ఇప్పటికీ పెద్దపూర్​ గ్రామ పరిధిలోనే కొనసాగించడం క్షమించరాని నేరమని ఫైర్​ అయ్యారు. ఆ పెద్ద మనిషిపై సీఎం కేసీఆర్​కు ఎంత విద్వేషం, వ్యతిరేకభావం ఉందో దీన్ని బట్టే అర్థమవుతోందని రేవంత్​ మండిపడ్డారు. అధికార మదంతో జయశంకర్​ సార్​కు గుర్తింపు రాకుండా చేశారని ఫైర్​ అయ్యారు. భగీరథ నీళ్లు కూడా అక్కంపేటకు రావట్లేదన్నారు.

 

మరిన్ని వార్తలు : -

వర్సిటీల్లో వీసీలు వచ్చి ఏడాదైనా మారని పరిస్థితి


హెచ్‌సీఏకు అంబటి రాయుడు గుడ్ బై!