
న్యూఢిల్లీ: బీజేపీ ఓ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అని.. ఎన్ని అవినీతి మరకలున్నా ఆ పార్టీలో చేరితే తొలగిపోతాయని కాంగ్రెస్ పార్టీ చురకలంటించింది. బీజేపీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అనే సూత్రంపై పనిచేస్తుందని, బీజేపీలో చేరగానే కేసులు క్లోజ్ అవుతాయని విమర్శించింది. బీజేపీలో చేరిన ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్‌పై ఉన్న 2017 అవినీతి కేసును సీబీఐ మూసివేయడంపై వినూత్నంగా నిరసన తెలిపింది.
కాంగ్రెస్ మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ హెడ్ పవన్ ఖేరా ఆధ్వర్యంలో ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వేదికపై ఓ వాషింగ్ మెషీన్ ప్రదర్శించి, బీజేపీ అంటే సింబాలిక్గాఇదేనంటూ ఎద్దేవా చేశారు. ఓ మురికి టీ షర్ట్‌పై కరప్షన్, ఫ్రాడ్, స్కాం అని రాసి దాన్ని వాషింగ్ మెషీన్లో వేసి.. అందులోనుంచి ‘బీజేపీ మోదీ వాష్’ అని రాసి ఉన్న టీ షర్ట్‌ను తీసి చూపించారు. ఈ టీ షర్ట్‌లాగే అవినీతి మరకలున్న ఏ నాయకుడు బీజేపీలో చేరినా వారిపై కేసులు తొలగిపోయి క్లీన్ చీట్ వస్తుందని తెలిపారు.