
హైదరాబాద్: కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి కొత్త కష్టాలొస్తున్నాయి. జాబితా ఆలస్యమైనా కొద్ది రకరకాల డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. మురళీధరన్ నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీ సభ్యులుగా ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగాఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు రోహిణ్ చౌదరి, విశ్వనాథ్, మన్సూర్ అలీఖాన్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. టికెట్ల కేటాయింపుల కోసం దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత తొలి సమావేశం గత నెలలో తాజ్ కృష్ణలో జరిగింది.
ఈ సందర్భంగా సునీల్ కనుగోలు సర్వే, అభ్యర్థుల బలాబలాలు, సామాజిక సమీకరణలపై చర్చించారు. తర్వాత రకరకా ఒత్తిళ్లు, సామాజిక సమీకరణాలు, సీనియర్లకు స్థానం కల్పించడంలో భాగంగా స్క్రీనింగ్ కమిటీలోకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్(ఓబీసీ), మాజీ మంత్రి షబ్బీర్ అలీ (మైనార్టీ), బలరాం నాయక్(ఎస్టీ)లను తీసుకున్నారు. అనంతరం పదుల సంఖ్యలో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగినా టికెట్ల కేటాయింపు కొలిక్కి రావడంతో ఒక మీటింగ్ కు మరో మీటింగ్ కు మధ్య కొత్త డిమాండ్ పుట్టుకు రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ కు అనుగుణంగా ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ టికెట్లను ఓబీసీలకు కేటాయించాలన్న డిమాండ్ ను బీసీ లీడర్లు తెరపైకి తెచ్చారు. తమకు 34 సీట్లు కేటాయించాలని కోరారు. తర్వాత మహిళా బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్ర లభించడంతో మహిళా లీడర్లు తమకు కనీసం 12 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అంబర్ పేట్ స్థానం కోసం పట్టుబట్టుతున్నారు. కానీ గోషామహల్ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అగ్రనేతలు ఆమెకు సూచిస్తున్నారు. అందుకు ఆమె విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో వైపు ముస్లిం నేతలు కర్నాటక ఫార్ములాను తెరపైకి తెచ్చారు. అక్కడ 12 స్థానాల్లో ముస్లింలకు టికెట్లు ఇస్తే 9 చోట్ల గెలిచారని, ఇక్కడ కూడా పాతబస్తీ బయట కనీసం ఆరు సీట్లు కేటాయిస్తే గెలిచి చూపిస్తామని పట్టుబట్టుతున్నారు. ఈ వ్యవహారం ఓ వైపు సాగుతుండగానే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు రేణకాచౌదరి, కుసుమ కుమార్ ఏకంగా ఢిల్లీ బాట పట్టారు. నిమిషాల్లో ఏఐసీసీ పెద్దల అపాయింట్ మెంట్ పొందారు. సీట్ల కేటాయింపుపై చర్చలు జరిపారు. తమకు 12 సీట్లు కేటాయించాల్సిందేని, లేదంటే తమ వద్ద ప్లాన్ బీ కూడా ఉందంటూ ఏకంగా అల్టిమేటం జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ లో ప్లాన్ బీ చర్చ మొదలైంది.
జనరల్ స్థానాల కోసం ఎస్సీ, ఎస్టీ నేతల పట్టు
రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్లున్నాయి. ఆ నియోజకవర్గాలు కాకుండా తమకు ఏడెనిమిది స్థానాలను కేటాయించాలని ఎస్టీ నాయకులు కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ నేతృత్వంలోని గిరిజన నేతల బృందం ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలిసి తమకు కనీసం మూడు జనరల్ స్థానాల్లో పోటీకి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రాములు నాయక్ నర్సాపూర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లేని పక్షంలో నారాయణ్ ఖేడ్ నుంచి పోటీకి చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నే ప్రీతమ్ కూడా ఇదే తరహా డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. తమకు కూడా జనరల్ స్థానాల్లో కనీసం రెండు సీట్లయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గోషామహల్ స్థానాన్ని సీకే మూర్తి ఆశిస్తుండగా.. సికింద్రాబాద్ లేదా రాజేంద్రనగర్ టికెట్ కోసం ఎస్సీసెల్ చైర్మన్ ప్రీతమ్ ప్రయత్నిస్తున్నారు. నిర్మల్ సీటును భారత్ చౌహాన్ ఆశిస్తున్నారు. సత్తుపల్లి టికెట్ తనకు కేటాయించని పక్షంలో కొత్తగూడెం జనరల్ స్థానాన్ని ఇవ్వాలని మనవతారాయ్ అడుగుతున్నారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నేతలకు జనరల్ సీట్లను కేటాయించినందున కర్నాటకలో సక్సెస్ అయ్యామని అదే ఫార్ములాను ఇక్కడా ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బిగ్ టాస్క్!
సర్వేలు, రీ సర్వేలు, సామాజిక సమీకరణాలు, బలాబలాలు, చేరిక వేళ హామీలు అన్నీ లెక్కలు వేసుకొని జాబితా సిద్ధం చేయడం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కి బిగ్ టాస్క్ గా మారింది. ఇప్పటి వరకు హైదరాద్ , ఢిల్లీలో పదుల సార్లు భేటీ అయినా జాబితా పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి రావడం లేదు. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడం, పోలింగ్ కు దాదాపు యాభై రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రతి గంట అమూల్యమైనదేనని ఆశావహులు భావిస్తున్నారు. ఈ తరుణంలో జాబితా రూపొందించి విడుదల చేయడం, ఆశావహులను బుజ్జగించి దారికి తెచ్చుకోవడం కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది.