రాహల్‌ను దేవుడికి వదిలిన ఎద్దుతో పోల్చిన కేంద్ర మంత్రి

రాహల్‌ను దేవుడికి వదిలిన ఎద్దుతో పోల్చిన కేంద్ర మంత్రి

ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్ దన్వే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగిన జన ఆశీర్వాద్ యాత్రలో మాట్లాడుతూ రాహుల్‌ను ఊర్లలో దేవుడికి వదిలేసిన ఎద్దుతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావ్ సాహెబ్ దన్వే తన కేంద్ర మంత్రి పదవికి పదవికి రాజీనామా చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ డిమాండ్ చేశారు. దన్వే తన లిమిట్స్ తెలుసుకోకుండా మాట్లాడడం షాకింగ్‌గా ఉందన్నారు. రాహుల్ గాంధీపై అసభ్యకరమైన భాషను వాడిన ఆయనను కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. 

కేంద్ర మంత్రి దన్వే ఏం అన్నారు?

జన ఆశీర్వాద్ యాత్రలో కేంద్ర మంత్రి రావ్ సాహెబ్ దన్వే మాట్లాడుతూ రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా ప్రతిపక్షాలు చూడాలని అన్నారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం దేశం అంతా తిరుగుతుంటారు కానీ ఆయన వల్ల ఎవరికీ ఏ ప్రయోజనం లేదని కామెంట్ చేశారు. ఆయన ఊరిలో రైతులు దేవుడికి వదిలే ఎద్దు లాంటి వాడని, అది పొలం దున్నడం గానీ, మరే పనిలో సాయంగా ఉండడం గానీ చేయదని, అయినా అది పొలాల్లో పడి పంట మేసినా రైతులు ఎవరూ ఏమీ అనకుండా క్షమించి వదిలేస్తారని అన్నారు. తాను గడిచిన 20 ఏండ్లుగా లోక్‌సభ ఎంపీగా ఉన్నానని, ఇన్ని సంవత్సరాలుగా రాహుల్‌ గాంధీని గమనిస్తున్నానని, ఆయన అంతా తిరుగుతుంటారే కానీ ఎవరికీ ఏం ఉపయోగం లేదని దన్వే కామెంట్ చేశారు.