- అర్హత ఉన్నా అందని సీఎం పదవి
- గవర్నర్ కావాలన్న ఆశా అడియాశే
- ఎంతో అనుభవమున్నా పట్టించుకోని అధిష్టానం
తెలంగాణ కాంగ్రెస్‌లో అతి కొద్దిమంది సీనియర్ నేతల్లో ఎం. సత్యనారాయణ రావు ఒకరు. పరిచయం అక్కరలేని ఆహార్యం, మాటలతో నవ్వులు పూయించగల నేర్పరితనం, అవే మాటలతో రాజకీయ మంటలూ పుట్టించగల గడుసుతనం ఆయన సొంతం. మూడుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఏఐసీసీలో కీలక పదవుల్లో పనిచేసిన ఎంఎస్ఆర్ మంగళవారం అనారోగ్యంతో చనిపోయారు. జనవరి 14, 1934లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ఎంఎస్ఆర్ జన్మించారు. అక్కడే మూడో తరగతి వరకు చదువుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం అంతా కరీంనగర్‌లో పూర్తి చేశారు. సత్యనారాయణరావుకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలందరికీ ఎంఎస్ఆర్‌గా ఆయన గుర్తుండిపోతారు.
ఎం. సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా అందరికీ సుపరిచితం. నెహ్రూ కాలం నుంచి సుదీర్ఘ కాలం పాటు ఆయన పాలిటిక్స్‌లో ఉన్నారు. 2014 వరకు క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఏఐసీసీలో కీలక పదవుల్లో MSR పనిచేశారు. ఎప్పటికైనా గవర్నర్ కావాలన్న ఆశ నెరవేరకుండానే చనిపోయారు.
ముక్కుసూటి తనం, విలువైన రాజకీయాలు చేసిన కొద్ది మంది నేతల్లో MSRకు మంచి పేరుంది. యూత్ కాంగ్రెస్ నేత నుంచి.. AICC ప్రధాన కార్యదర్శి వరకు పార్టీలో అనేక పదవులు నిర్వర్తించారు. పీసీసీ చీఫ్‌గా కూడా పనిచేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది MSR ఫిలాసఫీ. కాంగ్రెస్ పార్టీకి విధేయునిగా పనిచేసిన ఎం.సత్యనారాయణరావు.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్నారు. ఇందిరా, రాజీవ్ గాంధీతో కలిసి పనిచేశారు. 1969 ఉద్యమం తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి తరపున పోటీ చేసి కరీంనగర్ ఎంపీగా గెలిచారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 1977, 1980ల్లో జరిగిన ఎన్నికల్లోనూ కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ కేబినెట్‌లో దేవాదాయ, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టిన MSR.. తన స్థాయికి అతి చిన్నదైన ఆర్టీసీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనూ సత్యనారాయణరావు కీలకంగా పనిచేశారు. 1969లో జరిగిన ఉద్యమంలో పోరాటం చేసి 1969 నుంచి 1971 వరకు రెండేళ్లు జైలు జీవితం గడిపారు. దేశంలోని అనేక మంది కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ఎమ్మెస్సార్‌కు సన్నిహితులుగా ఉన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ దగ్గర ఎంతో విధేయతతో పనిచేసి... పార్టీ మనిషిగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలోని పాత తరం కాంగ్రెస్ ముఖ్యులుగా చెప్పుకునే వారిలో సత్యనారాయణరావు ఒకరు. కాంగ్రెస్ కురువృద్ద త్రయంగా జి.వెంకటస్వామి, పాల్వాయి పురుషోత్తంరెడ్డి, ఎమ్మెస్సార్ లను పిలిచేవారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఎమ్మెస్సార్ విసిరిన సవాలుతోనే కేసీఆర్ 2006లో కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తప్పక ఇవ్వాల్సిందేనని అధిష్ఠానం దగ్గర గట్టిగా వినిపించిన నేతల్లో కాకా వెంకటస్వామి, ఎమ్మెస్సార్ మాత్రమేనని కాంగ్రెస్ నేతలు చెప్తారు.
ఎన్నో పదవులు చేపట్టిన MSRకు ముఖ్యమంత్రి లాంటి పదవులు చేపట్టే అర్హత ఉన్నా... ఆ అవకాశం రాలేదు. ముక్కుసూటిగా మాట్లాడటం, గ్రూపు రాజకీయాలు చేయకపోవడంతోనే సీఎం పదవి దక్కలేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చివరి దశలో మాత్రం గవర్నర్ పదవి చేపట్టాలనే ఆశ ఉందంటూ చాలాసార్లు సన్నిహితుల దగ్గర చెప్పేవారు. ఆయన సన్నిహితుడు దివంగత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యాక అయినా ఎమ్మెస్సార్‌కు గవర్నర్ పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అది కూడా నెరవేరలేదు.
