
- పార్లమెంట్ సమావేశాల తర్వాత నేతలతో ఏఐసీసీ భేటీలు
- రేవంత్‌కు వ్యతిరేకంగా రిపోర్ట్ రెడీ చేస్తున్న సీనియర్లు
- పరిష్కారం వచ్చే దాకా వెనక్కి తగ్గొద్దని నిర్ణయం!
- ఇయ్యాల మరోసారి సీనియర్ల భేటీ?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ నేతల పంచాయితీ ఢిల్లీకి చేరింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్ర నేతలను ఢిల్లీకి హైకమాండ్ పిలవనున్నట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. భిన్న ధ్రువాలుగా ఉండే సీనియర్ నేతలు మొన్న జరిగిన భేటీలో ఒక్క తాటిపైకి వచ్చి రేవంత్‌కు వ్యతిరేకంగా గళం విప్పడాన్ని పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శీతాకాల సమావేశాల బిజీలో ఉన్న అధిష్టానం.. అవి ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ గొడవపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
‘‘ఈ పంచాయితీ దాదాపుగా ఢిల్లీలోనే పరిష్కారం అవుతుంది. అక్కడే మీటింగ్ జరుగుతుంది. ప్రత్యేక పరిస్థితుల్లో గాంధీభవన్‌కు కూడా వేదిక మారే అవకాశం ఉంది” అని ఏఐసీసీ బాధ్యతల్లో ఉన్న రాష్ట్ర నేత ఒకరు చెప్పారు. మరోవైపు ఇన్ని రోజులు సంయమనంతో వ్యవహరించామని చెబుతున్న నేతలు.. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. తాము గొంతెత్తిన తర్వాత కూడా తమపై దాడి అదే రీతిలో కొనసాగుతున్నదని, రేవంత్ వర్గానికి చెందిన కొందరు తమపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. తాము చచ్చినా పార్టీని వీడమని ఎన్నిసార్లు చెబుతున్నా, కోవర్టులంటూ, పార్టీ మారుతారంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యకు ఒక పరిష్కారం వచ్చే దాకా వెనక్కి తగ్గొద్దని సీనియర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.
ఫిర్యాదుకు రిపోర్టు
పార్టీలో కొంత కాలంగా తమకు ఎదురవుతున్న అవమానాలు.. తమకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాలపై సీనియర్లు ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నట్లు సమాచారం. కోవర్ట్ అంటూ ప్రచారం చేయడానికి సంబంధించిన ఆధారాలు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. రేవంత్ చేసిన వన్‌మ్యాన్ షోలు, వ్యక్తిగత ప్రమోషన్లకు సంబంధించిన వీడియోలు కూడా దీనికి జత పర్చనున్నట్లు ఒక ముఖ్య నేత తెలిపారు. ‘‘పార్టీలో దశాబ్దాలుగా ఉన్నాం. మాలో చాలా మంది ఎన్నడూ ఇంకో పార్టీ వైపు చూడలేదు. ఎనిమిదేండ్లుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ పార్టీ కోసం నిలబడ్డాం. కష్టాలు పడుతూ పార్టీ కోసం పని చేస్తుంటే.. ఇప్పుడు బురద జల్లుతూ తీవ్రస్థాయిలో దాడి చేయడం ఏంటి?’’ అని ఒక సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ విషయంలో ఏదో ఒకటి జరగాలి. అధిష్టానం ఇప్పుడు కూడా మా మాట సీరియస్‌గా తీసుకోకపోతే రాజకీయ సన్యాసం తప్ప వేరే మార్గం లేదు’’ అని ఆయన అన్నారు. ‘‘భిన్న ధృవాలుగా ఉండే నేతలు అవమానాలు తాళలేక ఏకమయ్యారు. చాలా కాలంగా పడని వాళ్లు కూడా కలిశారు. ఎంతో ఇబ్బంది పడితే తప్ప ఇలా ఒక్కటవ్వడం సాధ్యం కాదు” అని న్యూట్రల్‌గా ఉండే మరో నేత చెప్పుకొచ్చారు.
సీనియర్లను కలిసే ప్రయత్నం చేసిన నదీమ్ జావేద్
ఏఐసీసీ సెక్రటరీ నదీం జావేద్.. సీనియర్లతో మాట్లాడి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన సోమవారం వారికి కాల్ చేశారు. అయితే చాలా మంది నేతలు అందుబాటులోకి రాలేదు. కొందరు తాము నియోజకవర్గంలో ఉన్నామని చెప్పారు. కాగా సాయంత్రం పూట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా కొందరు నేతలు నదీమ్‌ను హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో కలిసి తమ బాధను వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళవారం మహేశ్వర్ రెడ్డి ఇంట్లో జరిగే సమావేశాన్ని రద్దు చేసుకోవాలని, హైకమాండ్‌కు విషయం వదిలేయాలని నదీమ్ కోరినట్లు తెలిసింది. కానీ మొన్న సమావేశమైన నేతలతోపాటు మరికొందరు వచ్చి మహేశ్ రెడ్డి ఇంట్లో జరిగే భేటీకి హాజరవుతారని కాంగ్రెస్ వర్గాల నుంచి లీక్‌లు వచ్చాయి. అయితే భేటీ ఉందా, లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు.