కాంగ్రెస్‌‌‌‌పై మండిపడ్డ బీజేపీ.. సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్

కాంగ్రెస్‌‌‌‌పై మండిపడ్డ బీజేపీ.. సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • ‘రాష్ట్రపత్ని’ అంటూ ఆధిర్ రంజన్ చేసిన కామెంట్‌‌‌‌తో దుమారం
  • కాంగ్రెస్‌‌‌‌పై మండిపడ్డ బీజేపీ.. సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • సభలో బీజేపీ ఎంపీతో మాట్లాడేందుకు వెళ్లిన సోనియా
  • మధ్యలో జోక్యం చేసుకున్న స్మృతీ ఇరానీ.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం

న్యూఢిల్లీ: వివాదాస్పద ‘రాష్ట్రపత్ని’ కామెంట్లు దుమారం రేపాయి. ప్రెసిడెంట్‌‌‌‌ ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ లోక్‌‌‌‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలు పార్లమెంటును కుదిపేశాయి. కాంగ్రెస్‌‌‌‌పై అధికార బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. అధిర్ చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. సభ వాయిదా పడ్డాక బీజేపీ ఎంపీతో మాట్లాడేందుకు సోనియా వెళ్లడం, అక్కడ కేంద్ర స్మృతి ఇరానీ జోక్యం చేసుకోవడం, వారిద్దరి మధ్య వాడీవేడి మాటల యుద్ధం జరగడం వివాదాన్ని మరింత పెంచింది. దీంతో పార్లమెంటులో రోజంతా రాజకీయ వేడి కొనసాగింది. మరోవైపు హిందీ సరిగా రాకపోవడంతో నోరు జారానని చెప్పిన అధిర్.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము బాధపడి ఉంటే 100 సార్లైనా క్షమాపణ చెప్తానన్నారు.

వివాదం మొదలైందిలా..

సోనియా గాంధీని ఈడీ విచారించడానికి వ్యతిరేకంగా విజయ్‌‌‌‌ చౌక్‌‌‌‌ వద్ద కాంగ్రెస్ ఎంపీలు నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన అధిర్.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అన్నారు. ఇది కాస్తా తీవ్ర వివాదమైంది. బీజేపీ భగ్గుమంది. గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌‌‌‌సభ సమావేశం కాగానే.. సోనియా క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాకా ఇదే పరిస్థితి. రాష్ట్రపతిని కాంగ్రెస్‌‌‌‌ నేత అవమానించారని స్మృతి అన్నారు. ‘‘కాంగ్రెస్ ద్వేషానికి ముర్ము టార్గెట్ అయ్యారు. అధిర్ చేసిన వ్యాఖ్యలకు ఆదివాసీలు, మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయి. దేశ అత్యున్నత రాజ్యంగ పదవిలో ఉన్న మహిళను అవమానించేందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుమతి చ్చారు. సోనియా క్షమాపణ కోరాలి. మీ లీడర్లు పేద గిరిజన మహిళను అగౌరపరుస్తున్నారు’’ అని స్మృతీ ఇరానీ అన్నారు.

దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే: నిర్మల

‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని నిర్మల డిమాండ్ చేశారు. “కాంగ్రెస్ అన్ని విధాలుగా గిరిజన నాయకురాలిని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే క్షమాపణలు చెప్పామని సోనియా అంటున్నారు.. కానీ ఆ అవసరం లేదని అధిర్ చౌదరి చెప్తున్నారు” అని ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఎంపీలతోపాటు ప్లకార్డులు పట్టుకుని నిర్మల నిరసనలు తెలిపారు. లోక్‌‌‌‌సభలో మాట్లాడుతూ.. అధిర్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసిన లైంగిక వేధింపులని ఆరోపించారు. కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌‌‌‌పై ప్రివిలేజ్ మోషన్‌‌‌‌ను ప్రవేశపెట్టాలని బీజేపీ మహిళా ఎంపీలు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రాజ్యసభలో అనుచితంగా ప్రవర్తించారరంటూ ఆప్ ఎంపీ సందీప్ కుమార్ పాఠక్, సుశీల్ కుమార్, ఇండిపెండెంట్ సభ్యుడు అజిత్ కుమార్ భుయాన్‌‌‌‌పై శుక్రవారం దాకా వేటు వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ ప్రకటించారు. 

కావాలంటే నన్ను ఉరితీయండి: అధిర్ రంజన్

రాష్ట్రపత్ని అంటూ కామెంట్ చేయడం తన పొరపాటేనని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ‘‘నేను బెంగాలీని. హిందీ మాట్లాడటం అంతగా రాదు. నోరు జారాను. దీనిపై రాష్ట్రపతికే  నేరుగా కలిసి క్షమాపణ చెప్తా. ఈ కపట నాటకాలాడేవాళ్లకు కాదంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు. ‘‘నేను చేసిన పొరపాటుకు కావాలంటే నన్ను ఉరితీయండి. ఇందులోకి మేడమ్​(సోనియా గాంధీ)ని లాగవద్దు”అని కోరారు.

సోనియా వర్సెస్ స్మృతి

మధ్యాహ్నం 12కి లోక్‌‌‌‌సభ వాయిదా పడ్డాక.. బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. అధిర్ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ సోనియా సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమయంలో బయటికి వెళ్లబోయిన సోనియా.. బీజేపీ ఎంపీ రమాదేవి వద్దకు వెళ్లారు. సోనియా వెంట ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ‘‘అధిర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. మధ్యలో నా తప్పేముంది?” అని ప్రశ్నించారు. ఈ సమయంలో వారి మధ్యలో స్మృతి ఇరానీ జోక్యం చేసుకున్నారు. ‘‘మేడమ్.. నన్ను సాయం చేయమంటరా? మీ పేరు లెవనెత్తింది నేను” అని అడిగారు. అప్పటికే కోపంతో ఉన్న సోనియా.. ‘నాతో మాట్లాడొద్దు’ అని స్మృతిని ఉద్దేశిస్తూ చెప్పారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య 2..3.. నిమిషాలపాటు మాటల యుద్ధం నడిచింది. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు టీఎంసీ ఎంపీ మొహువా మోయిత్రా, ఎస్పీపీ లీడర్ సుప్రియా సులే, బీజేపీ నుంచి ప్రహ్లాద్ జోషి, అర్జున్ మేఘ్వాల్ తదితరులు అక్కడికి వచ్చారు. స్మృతి ఇరానీ, ఇతర మగ ఎంపీలు సోనియాతో ఇష్టారీతిన ప్రవర్తించారని కాంగ్రెస్ ఎంపీలు గీతా కోరా, జోత్స్న మహంత్ ఆరోపించారు. సోనియా దురుసుగా ప్రవర్తించారని బీజేపీ ఎంపీలు చెప్పుకొచ్చారు. ఎన్సీపీ, టీఎంసీ ఎంపీలు సోనియాను  బయటకు తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.

కాంగ్రెస్ కౌంటర్ అటాక్

రమాదేవితో మాట్లాడేందుకు వెళ్లిన సోనియాను బీజేపీ ఎంపీలు ఎగతాళి చేశారని, బెదిరింపులకు దిగారని కాంగ్రెస్ కౌంటర్‌‌‌‌‌‌‌‌ అటాక్ చేసింది. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ‘‘ఈరోజు లోక్‌‌‌‌సభలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ దౌర్జన్యంగా ప్రవర్తించారు. మరి ఆమెను స్పీకర్ సస్పెండ్ చేశారా? రూల్స్‌‌‌‌ ప్రతిపక్షాలకేనా?” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. సోనియాకు వ్యతిరేకంగా సభలో అభ్యంతరకరంగా నినాదాలు చేశారని లోక్‌‌‌‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. ‘‘మహిళలు, సంస్కృతి పేరుతో నినాదాలు చేసే బీజేపీ.. భారతీయ మహిళను ఎలా అగౌరవపరిచి, గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించింది’’ అని చెప్పారు. బీజేపీ తీరు సిగ్గుచేటని, ప్రధాని కచ్చితంగా క్షమాపణ చెప్పితీరాలని కాంగ్రెస్ ఎంపీ జ్యోత్స్న మహంత్ డిమాండ్ చేశారు.